తమిళ సినిమా: ఎన్నడూ లేనట్లుగా చిత్రపరిశ్రమ 48 రోజుల పాటు నిరవధిక సమ్మె. తమిళ సినీ పరిశ్రమ స్తంభించిందనే చెప్పాలి. ఎక్కడ షూటింగ్‌లు అక్కడ ఆగిపోయాయి. నటీనటుల నుంచి ఇతర సాంకేతిక వర్గం ఇళ్లకే పరిమితమైపోయారు. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితికి పుల్‌స్టాప్ పడడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సినీ వర్గాలు శుక్రవారం నుంచి అందరూ తమ తమ విధులకు రెడీ అవుతున్నారు. అలా నటుడు విజయ్ చిత్ర బృందం ఏకంగా విదేశాలకే పయనం అవ్వడానికి సన్నద్ధం అవుతోంది.
విజయ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.
ఈ నెల 25వ తేదీన విజయ్ చిత్రం యూనిట్ విదేశాలకు పయనం కానుందని సమాచారం. అక్కడ విజయ్, కీర్తీసురేశ్‌ల యువళ గీతాలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేసుకున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది సమాజానికి సంబంధించిన ఒక ముఖ్య అంశాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment