![Vijay 63rd Movie With Director Atlee - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/15/vijay.jpg.webp?itok=A4E2TT5I)
సినిమా: సర్కార్ వివాదాలు, సంచలనాలు, సక్సెస్‌ను అనుభవిస్తున్న నటుడు విజయ్ 63వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో తెరి, మెర్శల్ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. దీన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశ్, కల్పాత్తి ఎస్.సురేశ్ నిర్మిస్తున్నారు. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల మెర్శల్, సర్కార్ చిత్రాల తరువాత విజయ్, ఏఆర్.రెహ్మాన్‌ల కలయికలో సంగీతప్రియులను అలరించడానికి తయారవుతున్న చిత్రం ఇది.
ఈ చిత్ర వివరాలు ఏజీఎస్ సంస్థ అధినేతలు బుధవారం అధికారిక పూర్వకంగా వెల్లడించారు. విజయ్ హీరోగా మరోసారి చిత్రం చేయడం సంతోషంగా ఉందని, ఇది తమ సంస్థలోనే అత్యంత భారీ చిత్రంగా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇందులో విజయ్‌తో రొమాన్స్ చేసే బ్యూటీస్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో అగ్రనటి నయనతార, క్రేజీ బ్యూటీ సమంతలో ఒకరిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సమంతనే నటించే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ భామ ఇంతకు ముందు తెరి, మెర్శల్ చిత్రాల్లో విజయ్‌తో నటించిందన్నది గమనార్హం. ఈ చిత్రం టైటిల్ ఏమై ఉంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. కారణం దర్శకుడు అట్లీ ఇప్పటికే ఆళపోరాన్ తమిళన్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఆళపోరాన్ తమిళన్ అంటే పాలించడానికి తమిళుడు వస్తున్నాడు అని అర్థం. ఈ టైటిల్ విజయ్ చిత్రానికి ఖరారైతే మరోసారి ఆయన రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంలో నటిస్తున్నట్లే భావించాలి.
Comments
Please login to add a commentAdd a comment