Dear Comrade Review, in Telugu | ‘డియర్‌ కామ్రేడ్‌‌’ మూవీ రివ్యూ | Vijay Devarakonda, Rashmika Mandanna, Bharat Kamma - Sakshi
Sakshi News home page

‘డియర్‌ కామ్రేడ్‌‌’ మూవీ రివ్యూ

Published Fri, Jul 26 2019 12:51 PM | Last Updated on Sat, Jul 27 2019 9:30 AM

Vijay Devarakonda Dear Comrade Telugu Movie Review - Sakshi

టైటిల్ : డియర్‌ కామ్రేడ్‌
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్‌, సుహాస్‌
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
దర్శకత్వం : భరత్ కమ్మ
నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్‌, యష్‌ రంగినేని

సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్‌ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా డియర్‌ కామ్రేడ్. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల తరువాత విజయ్‌ మార్కెట్ స్టామినాకు ఈ సినిమా యాసిడ్‌ టెస్ట్ లాంటిదని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విజయ్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని తానే అయి ప్రమోట్ చేస్తూ వచ్చాడు. టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్ ఆకట్టుకోవటంతో సినిమా సక్సెస్‌ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి డియర్‌ కామ్రేడ్‌తో విజయ్ ఆశించిన సక్సెస్ వచ్చిందా..?

 
కథ :
చైతన్య అలియాస్ బాబీ (విజయ్‌ దేవరకొండ) విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్‌. కాకినాడలోని కాలేజ్‌లో చదువుకునే బాబీ తన కోపం కారణంగా చాలా మందితో గొడవలు పడతాడు. అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ (రష్మిక మందన్న) స్టేట్‌ లెవల్‌ క్రికెట్ ప్లేయర్‌. తన కజిన్‌ పెళ్లి కోసం కాకినాడ వచ్చిన లిల్లీ, బాబీతో ప్రేమలో పడుతుంది. కానీ అతని కోపం, గొడవల కారణంగా వారిద్దరూ దూరమవుతారు. లిల్లీ దూరం అవ్వటంతో బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు.

నెమ్మదిగా ఆ బాధను మరిచిపోయిన బాబీ ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ లిల్లీని కలుస్తాడు. తను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఆమె కోలుకునేలా చేస్తాడు. అదే సమయంలో లిల్లీ ఆరోగ్యం పాడవ్వడానికి, క్రికెట్కు దూరమవ్వటానికి క్రికెట్ అసోసియేషన్‌ చైర్మన్ వేదింపులే కారణమని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి బాబీ ఏం చేశాడు..? లిల్లీ తిరిగి క్రికెటర్‌ అయ్యిందా? లేదా? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్‌ దేవరకొండ మరోసారి ఆకట్టుకున్నాడు. విద్యార్థి నాయకుడిగా, ప్రేమికుడిగా, ప్రేమ దూరమై బాధలో ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. విజయ్ మార్క్‌ అగ్రెసివ్‌ సీన్స్‌ సినిమాకు ప్లస్ అయ్యాయి. చాలా సందర్భాల్లో అర్జున్‌ రెడ్డిని గుర్తు చేస్తాడు విజయ్‌. రష్మిక మందన్న లిల్లీ పాత్రలో ఒదిగిపోయారు. రొమాంటిక్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించిన రష్మిక, ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించారు. అక్కడక్కడా డబ్బింగ్ చెప్పటంలో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. మల్టీ లింగ్యువల్ సినిమా కావటంతో ఇతర పాత్రల్లో ఎక్కువగా పరభాష నటులే కనిపించారు. అంతా తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ :
విప్లవ భావాలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడటం. ఆ తరువాత తన భావాలకు, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ, వాటి వల్ల ఎదురైన పరిస్థితుల, మహిళా క్రికెట్ అసోషియేషన్‌లో వేదింపుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా డియర్‌ కామ్రేడ్‌. కథా పరంగా బాగానే ఉన్న కథనంలో మాత్రం దర్శకుడు మెప్పించలేకపోయాడు. తను అనుకున్న కథను సుధీర్ఘంగా చెప్పిన దర్శకుడు ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథనంలోనూ కొత్తదనం లేకపోవటం నిరుత్సాహం కలిగిస్తుంది.

కథ అంతా సెకండ్ హాఫ్ కోసం దాచిపెట్టిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్‌ అంతా హీరో క్యారెక్టర్ ఎలివేషన్‌ కోసం తీసుకున్నాడు. ప్రథమార్థంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్‌ ట్రాక్‌, కాలేజ్‌ సీన్స్‌తో కాస్త పరవాలేదనిపిస్తాయి. కానీ ద్వితీయార్థం మరీ సాగదీసినట్టుగా ఉంది. అయితే కొన్ని రియలిస్టిక్‌ సీన్స్‌, లోకేషన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. పోయిటిక్‌ స్టైల్‌ టేకింగ్, నేరేషన్‌ ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ను మెప్పించినా అన్ని వర్గాలను అలరించటం కష్టమే.

సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్ పాటలు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతానికి సాహిత్యం, టేకింగ్ అన్నీ కలిసి పాటలను విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి. దర్శకుడు మెప్పించలేకపోయిన సన్నివేశాల్లో కూడా జస్టిన్ సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కేరళ అందాలతో పాటు నార్త్‌లో తెరకెక్కించిన రోడ్‌ సీన్స్‌ విజువల్స్‌ కూడా మెప్పిస్తాయి. ఎడిటర్‌ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ప్రతీ సన్నివేశం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌ :
విజయ్‌ దేవరకొండ
లవ్‌ ట్రాక్‌
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
స్క్రీన్‌ప్లే
స్లో నేరేషన్‌
సినిమా నిడివి

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement