విజయ్ దేవరకొండ
‘‘పెళ్ళి చూపులు’ సినిమా రిలీజ్‌కు ముందు ‘టాక్సీవాలా’కి జరిగినట్లే ఆ సినిమా లీక్ అయ్యుంటే నాకు ‘అర్జున్‌రెడ్డి’ అవకాశం వచ్చేది కాదు. అలాగే ‘పెళ్ళి చూపులు’ థియేటర్స్‌లో సరిగ్గా రిలీజై పెద్ద హిట్ సాధించేది కాదు. నాకు కెరీర్‌నే లేకుండా పోయేది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇంకా ఆడిషన్స్ ఇస్తూ, చాన్స్‌లకు కోసం ప్రయత్నిస్తూనే ఉండేవాడినేమో. లేకపోతే ప్రొడక్షన్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ సైడ్ వెళ్లిపోయేవాడినేమో. స్టార్‌డమ్ కోసం చాలా కష్టపడ్డాను’’ అన్నారు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా రూపొందిన సినిమా ‘టాక్సీవాలా’. మాళవికా నాయర్ కీలక పాత్ర చేశారు. యూవీ, జీఏ2 బ్యానర్స్‌పై ఎస్‌కేయన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు...
► ‘టాక్సీవాలా’లో యాక్టర్స్ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. మాళవికా నాయర్ పాత్ర సినిమాకి కీలకమైంది. అందుకే ట్రైలర్, టీజర్‌లో ఆమెను రివీల్ చేయలేకపోయాం. నిజానికి ఆ రోల్‌కి చాలా మందిని అడిగాం. మాళవిక చేయడం బాగా హెల్ప్ అయ్యింది.
► నాకు ఝలక్ తగిలింది ‘నోటా’ వల్ల కాదు... ‘టాక్సీవాలా’ పైరసీ కావడం వల్ల. ఈ సినిమా రైటర్, హీరోయిన్, దర్శకుడు, అందరూ ప్రతిభావంతులే. వీరందరికీ ఇది ఫస్ట్ సినిమా. నేనిప్పుడీ స్థాయిలో ఉండటానికి నా తొలి సినిమా ‘పెళ్ళిచూపులు’ ఒక కారణం. కానీ వీళ్ల ఫస్ట్ సినిమా లీక్ అవ్వడం బాధగా ఉంది.
► ‘రెండు నెలలు క్రితమే సినిమా మా దగ్గరకు వచ్చింది. రిలీజ్ తర్వాత పెడదాం అనుకున్నాం. కాపీ వేరే వాళ్లు పెట్టడంతో మేం పెడుతున్నాం’ అని నిన్న మొన్న సినిమాను వైరల్ చేసిన వారు లెటర్స్ పెడుతున్నారు. ఈ సైట్స్‌ను కంట్రోల్ చేయలేం. యాంటీ పైరసీ టీమ్ లింక్‌ను తీసేసినా మళ్లీ పెడుతున్నారు. పోర్న్‌సైట్లను బ్యాన్ చేసినట్లు, పైరసీ సైట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమాపై ఆధారపడి చాలా మంది ఉన్నారు. ఈ చిత్రం టీమ్ మెంబర్స్ నాలా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లే. రీ రీకార్డింగ్ టైమ్‌లో జేక్స్ వాళ్ల ఫాదర్‌కు హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కష్టపడి ఈ సినిమాకు పనిచేశాడు. వాళ్ల నాన్నకు కీమోథెరపీ చేయిస్తూనే జేక్స్ రీ–రీకార్డింగ్‌ను కంప్లీట్ చేశాడు.
► రిలీజ్‌కి ముందు నా సినిమాలే ఎందుకు లీక్ అవుతున్నాయి? అనిపిస్తుంటుంది. ఇటీవల మా స్కూల్ ఫ్రెండ్స్‌ను లొకేషన్లో మీట్ అయ్యాను. నా సినిమాలు లేని టైమ్‌లో మేం కలిసి ఉన్న ఫొటోలను చూపించారు. 2012–2013 ఫొటోలు అవి. వాటిలో నన్ను నేను చూసుకుని గుర్తు పట్టలేకపోయాను. కెరీర్ ఏంటి? అనే టెన్షన్ ఉండేది. సినిమాలు వస్తాయా? డబ్బులు ఏంటీ? లైఫ్ ఏం అవుతుంది? అని ఆలోచిస్తుండేవాడిని. ఫ్రెండ్స్ నా కోసం ఖర్చు పెట్టేవారు. ఒకప్పుడు సినిమాలు లేవనే టెన్షన్. అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు సినిమా ఉంది. అది పైరసీ అవుతుంది. సర్లే.. ఇది బెటర్ కదా అనిపిస్తోంది. ఒక సినిమా అటూ ఇటూ అయితే సేఫ్‌గార్డ్‌గా ఉండగలిగే స్థాయిలో మనం ఉన్నాం అనే ఫీలింగ్ ఉంది.
► థియేటర్స్‌లోకి రాకముందే నీ సినిమా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే పాజిటివ్ యాంగిల్‌లో ఆలోచించవచ్చు కదా అని నా స్నేహితుడు అన్నాడు. కానీ టీమ్ అందరి లైఫ్స్ ఆధారపడి ఉంటాయి. లీక్ చేసిన వారు కనిపించని శత్రువులు. వారిపై ఎలా పోరాడగలం.
► ‘నోటా’ ప్రమోషన్స్ టైమ్‌లో మా అమ్మ ఆరోగ్యం పాడైంది. హాస్పిటల్‌కి వెళ్లే దారిలో.. అమ్మ గురించి ఆలోచించా. హాస్పిటల్‌లో ఏం జరుగుతుందో తెలీదు నాకు. ఆ జర్నీలో మెంటల్‌గా యాక్టింగ్‌ను వదిలేశాను. అయినవాళ్లను చూసుకోలేనంతగా బిజీయా? అనిపించింది. నాకు ఈ కేరీర్ వద్దు. డబ్బు వద్దు. ఫేమ్ వద్దు. అన్నీ వదిలేద్దాం అనుకున్నా. మెంటల్‌గా నా ప్రొడ్యూసర్స్‌కి కాల్ చేసి అడ్వాన్సులు రిటర్న్ చేద్దామని అనుకున్నా. యాక్టింగ్‌ను వదిలేద్దాం అని ఫిక్స్ అయ్యాను. హాస్పిటల్‌కి వెళ్లిన తర్వాత అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది.
► నేనంటే ఇష్టపడేవారిని కొందరు సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తున్నారు. అందుకే ‘‘నేను చేయబోయే సినిమాలు నాకు తెలుసు. వాళ్లకు తెలీదు. మాట్లాడిన వాళ్లకు సక్సెస్‌తో సమాధానం చెబుదాం’’ అనే పోస్ట్‌ను షేర్ చేశాను. నాపై కొందరు యంగ్ హీరోలు అసూయగా ఉన్నారు అంటే నాకు ఓకే. కానీ ఎవ్వరితో ఎక్కువగా ఏం మాట్లాడను. నేను, నా టీమ్, నా స్కూల్ ఫ్రెండ్స్‌తో ఉంటాను.. అంతే.
► యాక్టర్ని అవుతాననుకోలేదు. అయ్యాను. నా ఒకటో తరగతి నుంచే చిరంజీవిసార్ సినిమాలు చూస్తున్నాను. అలాంటిది చిరంజీవిసార్,బన్నీ అన్న నా సినిమాల ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లకు వచ్చి నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి వాటిని మర్చిపోవాలనుకుంటున్నా. నాకు అరవయ్యేళ్లు వచ్చినప్పుడు ఈ వీడియోస్ పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తాను.
► ఒక సినిమా రిలీజైన తర్వాత ఏం జరిగిందో ఆలోచించి నెక్ట్స్ స్టెప్ తీసుకోవాలి. ఇటీవల ‘గీతగోవిందం, టాక్సీవాలా, నోటా’సినిమాలకు ఒకే టైమ్‌లో వర్క్ చేశాను. ఒక టైమ్‌లో ఒక సినిమాపైనే ఫోకస్ పెట్టి తక్కువ సినిమాలు చేద్దామనుకున్నా. కానీ చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఎన్నింటికి నో చెప్పినా ఇప్పటికీ ఫుల్ బిజీ వర్క్‌లోనే ఉన్నాను. ‘డియర్ కామ్రేడ్’ సినిమా 30 పర్సెంట్ అయిపోయింది. నా ప్రొడక్షన్ హౌస్ గురించి త్వరలో అనౌన్స్ చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment