
పోస్టర్ చించిన వీహెచ్.. చిల్ అన్న హీరో
సాక్షి, హైదరాబాద్: బస్సుపై అంటించిన సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందని.. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు బస్సును ఆపించి మరీ చించేశారు. ఈ ఘటన నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద చోటు చేసుకుంది. గాంధీ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వీహెచ్ తిరిగి వెళుతుండగా ఓ ఆర్టీసీ బస్సు మీద నటుడు విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను గమనించారు.
వెంటనే బస్సును ఆపించి కండక్టర్ సాయంతో పోస్టర్‌ను తొలగించేశారు. ఇలాంటి పోస్టర్లు యువతను తప్పుదోవ పట్టిస్తాయని వీహెచ్ అన్నారు. డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని హితవు పలికారు.
చిల్ తాతయ్యా..
వీహెచ్ పోస్టర్ చింపేస్తున్న ఫొటో వైరల్ అవడంతో పోస్టర్‌లోని నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘చిల్ తాతయ్యా’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్టర్ చించుతున్న ఫొటోను పోస్ట్ చేశారు.