ఏక్‌ రాజా.. తీన్‌ రాణియో“! | Vijay Deverakonda NEW MOVIE Launch | Sakshi
Sakshi News home page

ఏక్‌ రాజా.. తీన్‌ రాణియో“!

Published Sun, Nov 4 2018 4:06 AM | Last Updated on Sun, Nov 4 2018 4:58 AM

Vijay Deverakonda NEW MOVIE Launch - Sakshi

రాశీ ఖన్నా, విజయ్‌ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్, ఇసా బెల్ల

వెండితెరపై అందాల తార ఒకరు మెరిస్తే చాలు థియేటర్‌లో యూత్‌ చేసే  అల్లరి మామూలుగా ఉండదు. అలాంటిది ఒకేసారి ముగ్గురు కథానాయికలు ఫ్రేమ్‌లోకి వస్తే... అప్పుడు ఇక అల్లరి డబుల్‌ కాదు.. త్రిబుల్‌. ప్రస్తుతం మన టాలీవుడ్‌లో ముగ్గురు హీరోయిన్లతో సిల్వర్‌ స్క్రీన్‌పై తీన్మార్‌ స్టెప్పులేయనున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.

మేడమ్‌.. మేడమ్‌... మేడమ్‌!
అరే ఏందిరా భయ్‌. హీరోగా పట్టుమని పది సినిమాలు థియేటర్‌లో పడలేదు కానీ మస్త్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించిండు. మార్కెట్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుండు. ఒకప్పుడు సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసినోడు ఇప్పుడు కొత్త సినిమా అంటే డైరీలో ఖాళీ ఉందా? లేదా అని చూసుకుంటుండు. అంత బిజీ అయిపోయిండు మరి. అవును.. ఇదంతా హీరో విజయ్‌ దేవరకొండ గురించే. ‘పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ సినిమాల తర్వాత హీరోగా విజయ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకూ విజయ్‌ ఆరడజను సినిమాలు చేయగా, అన్నీ సోలో హీరోయిన్‌ మూవీలే. ఇప్పుడు ఏకంగా ముగ్గురు కథానాయికలతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అయ్యారాయన.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసా బెల్ల కథానాయికలుగా నటిస్తున్నారు. జనరల్‌గా ఒక కథానాయిక ప్రేమను దక్కించుకోవడం కోసమే హీరోలు పడరాని పాట్లు పడుతుంటారు సినిమాల్లో. ఎవరో ఎందుకు? ‘గీత గోవిందం’ సినిమాలో హీరో విజయ్‌ హీరోయిన్‌ రష్మికా మండన్నా చుట్టూ ‘మేడమ్‌ మేడమ్‌’ అని తిరిగి ఎంత అల్లాడిపోయారో గుర్తుండే ఉంటుంది. మరి.. ఈ తాజా సినిమాలో ఈ ముగ్గురు కథానాయికల చుట్టూ ‘మేడమ్‌ మేడమ్‌ మేడమ్‌’ అంటూ తిరుగుతారా? లేదా ముగ్గురూ ‘బాస్‌ బాస్‌ బాస్‌’ అంటూ విజయ్‌ చుట్టూ తిరుగుతారా? అనేది వెండితెరపై చూడాలి.

డిస్కో రాజా.. మాస్‌ రాణులు
సిల్వర్‌ స్క్రీన్‌పై మాస్‌ మహారాజా రవితేజ ఉంటే చాలు థియేటర్‌లో ఆడియన్స్‌ హంగామా మామూలుగా ఉండదు. పాటలు, పంచ్‌లు, ఫైట్లు, ప్రాసలను తనదైన స్టైల్లో డెలివరీ చేస్తారాయన. మరి.. ఈ మాస్‌ రాజా  ముగ్గరు రాణులతో లవ్వాట ఆడితే ఎలా ఉంటుందో చూడాలంటే కాస్త టైమ్‌ పడుతుంది. ‘ఒక్కక్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాల ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘డిస్కో రాజా’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్‌ పరంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించే అవకాశం ఉందని సమాచారం. ఆల్రెడీ ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేష్‌ ఒక హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మరో కథానాయికగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ సై అన్నారని సమాచారం.

నభా నటేష్‌, రవితేజ, పాయల్‌ రాజ్‌పుత్‌

మరో హీరోయిన్‌ పేరు త్వరలో రావొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా టైమ్‌ మిషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. రామ్‌ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇంతకుముందు రవితేజ ‘విక్రమార్కుడు, బలుపు, పవర్, బెంగాల్‌ టైగర్‌’ సినిమాల్లో ఇద్దరు కథానాయికలతో నటించారు. అలాగే... పధ్నాలుగేళ్ల క్రితం రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ చిత్రంలో గోపిక, భూమిక, మల్లిక, కనిక కథానాయికలుగా నటించారు. కానీ ఆ  సినిమా లైఫ్‌లో ఉండే డిఫరెంట్‌ ఫేజ్‌ల ఆధారంగా సాగుతుందన్న విషయం తెలిసిందే. ‘మిరపకాయ్, డాన్‌ శీను, బలుపు, పవర్, రీసెంట్‌గా బెంగాల్‌ టైగర్‌’ రవితేజ ఇద్దరు హీరోయిన్స్‌తో నటించిన కొన్ని సినిమాలు.

పాస్ట్‌.. ప్రెజెంట్‌!
‘పీఎస్వీ గరుడవేగ’తో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు రాజశేఖర్‌. ‘అంకుశం, సింహరాశి’ వంటి మాస్‌ సినిమాలతోనే కాదు. ‘మా అన్నయ్య, గోరింటాకు, అల్లరి ప్రియుడు’ వంటి క్లాస్‌ సినిమాలతోనూ ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన తాజాగా ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’లో నటిస్తున్నారు. 1980 నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అదా శర్మ, నందితా శ్వేతా, స్కార్లెట్‌ విల్సన్‌ కథానాయికలు. సో... గతం, వర్తమానంలో ఈ సినిమా ఉంటుందేమో.

రాజశేఖర్‌,నందితా శ్వేతా, అదా శర్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement