
హాలీవుడ్‌కు విజయ్, రాజకీయాల్లోకి అజిత్!
ఇళయదళపతి విజయ్ హాలీవుడ్‌లోకి, అల్టిమేట్ స్టార్ అజిత్ రాజకీయాల్లోకి. ఇది సాధ్యమేనా? అలా సాధ్యం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక ప్రముఖ దర్శకుడు పేర్కొన్నారు. విజయ్, అజిత్ వీరిద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు. వీరికి వృత్తిపరంగా పోటీ ఉంది. ఇద్దరికీ తమిళనాడు దాటి తెలుగు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లోనూ వీరి చిత్రాలు వసూళ్లను సాధిస్తాయి. వీరిలో ఒకరిని రాజకీయాల్లోకి, మరోకరిని హాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి రాజ్ తిరుసెల్వన్ అనే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈయన ప్రవాస భారతీయుడన్నది గమనార్హం.
రాజ్ తిరుసెల్వన్ తాజాగా లేక్ ఆష్ ఫైర్ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రెండు కథలను తయారు చేశానన్నారు. అందులో తమిళనాడు రాజకీయాల గురించి కథ ఒకటన్నారు. తమిళనాడులో రెండు పార్టీలే మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయని, దీనికి కారణం ఏమిటి? వీటి వెనుక ఎవరున్నారన్న వాస్తవాలను తెలిపే కథలో నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయాలనుకుంటున్నానని, అందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీని సిద్ధం చేశానన్నారు.
ఇందులో నటుడు విజయ్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఇక్కడ చాలా సాధించారని, హాలీవుడ్‌లో సాధించేలా ఈ కథను ఆయన కథానాయకుడిగా హాలీవుడ్ చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజ్ తిరుసెల్వన్ తెలిపారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్, అజిత్ ఆయన చిత్రాల్లో నటించడానికి అంగీకరిస్తారా అన్న అంశాలు ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.