
నేను మహిళలను కించపరచను: హీరో విజయ్
సాక్షి, చెన్నై: సామాజిక మీడియా, ఇతర ఆన్‌లైన్ వేదికలపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే మహిళలను కించపరిచే సంస్కృతికి తాను వ్యతిరేకమని తమిళ సూపర్ స్టార్ విజయ్ చెప్పారు. తాను మహిళలను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఎవరి సినిమానైనా విమర్శించే హక్కు ఉందన్నారు. సోషల్ మీడియాలో మహిళలు నొచ్చుకునే విధంగా ఎవరూ కామెంట్లు పెట్టవద్దని ఆయన అభిమానులను కోరారు.
ధన్యా రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టు, ఇటీవల విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్, గతంలో విడుదలైన విజయ్ చిత్రం ‘సూర’ లాగా బాగా లేదని, ఆట మధ్యలోనే లేచి వచ్చేశా అంటూ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు విజయ్ అభిమానులకు కోపం తెప్పించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో ధన్యా రాజేంద్రన్ చెన్నైలోని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మహిళను కించపరిచే విధంగా పోస్టులు పెట్టొందంటూ అభిమానులను కోరారు.