మహిళా జర్నలిస్టుకు హీరో ఫ్యాన్స్ అసభ్య మెసేజ్‌లు!
చెన్నై: తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ అభిమానం శ్రుతి మించారు. తన హీరో నటించిన సినిమా బాగోలేదని కామెంట్ పెట్టిన ఓ మహిళా జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగళూరుకు చెందిన జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సీజల్’ కి వెళ్లింది. అయితే ఆ సినిమా ఆమెకు అంతగా నచ్చకపోవడంతో ఇంటర్వెల్ కాకుండానే థియేటర్ నుంచి వచ్చేసింది.
అదే విషయాన్ని ధన్య రాజేంద్రన్ శుక్రవారం ట్వీట్ చేస్తూ కొన్నేళ్ల క్రితం హీరో విజయ్ నటించిన ‘సురా’ సినిమా చూసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందని, అయితే ఆ సినిమా కనీసం ఇంటర్వెల్ దాకా అయినా కూర్చోబెట్టిందని, షారుక్ సినిమా అంతకంటే దారుణంగా ఉందని పోస్ట్ చేసింది.
దీంతో విజయ్ ఫాన్స్ ఆమెపై సోషల్‌మీడియాలో వల్గర్ కామెంట్లతో ప్రతిదాడికి దిగారు. అసభ్య పదజాలంతో రీ ట్వీట్ చేయటమే కాక బూతు మెసేజ్‌లు, ట్రోలింగ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా మహిళా జర్నలిస్టుపై బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో గత మూడు రోజులుగా సుమారు 45వేలకు పైగా ట్విట్లు వచ్చాయి. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పక్కా ఫ్లాన్ ప్రకారం తనపై హీరో అభిమానులు ట్రాలింగ్ చేశారని ఆమె ఫిర్యాదు చేశారు.
ధన్యా రాజేంద్రన్ ఫిర్యాదుపై విచారణ అధికారులు మాట్లాడుతూ... ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. అయితే అసభ్యంగా కామెంట్లు చేసిన పలువురు తమ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం). కాగా ఈ వివాదంపై హీరో విజయ్ ఇంతవరకూ స్పందించలేదు.