
విజయ్ నోట ‘కత్తి’లాంటి
ఇళయదళపతి విజయ్‌లో మంచి గాయకుడున్నాడన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాడటం ఆయనకు ఫ్యాషన్. తన చిత్రాల్లో ఒక్కో పాట పాడుతుంటారు. ఆ మధ్య విడుదలైన తుపాకీ చిత్రంలో పాడిన గూగుల్ గూగుల్ పాట విశేష ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం నటిస్తున్న కత్తి చిత్రంలో కూడా ఒక పాట పాడనున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కత్తిలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర అని సమాచారం.
సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రంలో ఒక మంచి దుమ్మురేపే మసాలా సాంగ్ చోటు చేసుకుందట. ఈ పాటకు ప్రస్తుతం ట్యూన్ కడుతున్న అనిరుధ్ త్వరలోనే విజయ్‌తో పాడించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది.