
‘‘మీరు సినిమాలు మానేసి చాలాకాలం అయ్యింది కదా! అయినా ఇంతమంది అభిమానులు మీ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఎలా నిర్వహిస్తున్నారు’ అని ఓసారి నా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న దాసరి నారాయణరావుగారు నన్ను అడిగారు. ‘వాళ్లకు నాపై ఉన్న అభిమానం, నాకు వాళ్ల మీద ఉన్న అభిమానంతోనే అంతమంది ఫ్యాన్స్ వస్తుంటారని చెప్పాను’’ అని నటి, దర్శకురాలు విజయ నిర్మల అన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అభిమానుల సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో విజయనిర్మల 74వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనిర్మల మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. మీ అభిమానమే నా ఆయుష్షు. మీ అందరి మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయనిర్మలగారు ‘మా’ను (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ప్రాణంగా చూసుకుంటూ ప్రతి సంవత్సరం డొనేషన్‌లు ఇస్తు్తన్నారు.
ఈ సంవత్సరం కూడా ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వనంత డొనేషన్ ఇచ్చి తన సహృదయాన్ని చాటుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఫ్యాన్స్ అభిమానం వల్లే మేమింత సంతోషంగా ఉండగలుగుతున్నాం’’ అన్నారు. ‘‘విజయనిర్మలగారు ‘మా’ అసోసియేషన్‌పై ఎంతో ప్రేమతో ప్రతి నెలా రూ. 15,000, ‘మా’ కల్యాణ లక్ష్మి’ పథకానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తన 74వ పుట్టినరోజు సందర్భంగా రూ. 74,000 అసోసియేషన్‌కు అందజేశారు. ఇటీవల పుల్వామా ఘటనలో మరణించిన వీరసైనికుల కుటుంబాలకు మా కుటుంబం తరఫున లక్ష రూపాయలు అందించాం’’ అని నటుడు, విజయనిర్మల తనయుడు నరేష్ చెప్పారు. ఈ వేడుకల్లో నటి జయసుధ, నిర్మాతలు శాఖమూరి మల్లికార్జునరావు, బి.ఎ. రాజు, సురేష్ కొండేటి, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటి గీతాసింగ్ పాల్గొని విజయనిర్మలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షుడు దుడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి.మల్లేష్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన అధ్యక్షులు ఖాదర్ గోరి పాల్గొ్గన్నారు.
Comments
Please login to add a commentAdd a comment