నాకు స్ఫూర్తి వారే! : హీరో విక్రమ్
‘‘నా నట ప్రస్థానం ప్రారంభమై పాతికేళ్లయింది. ఇన్నేళ్ల ప్రయాణంలో నన్ను నేను అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. నన్ను విలక్షణ నటుడు అని అంటున్నారు. కానీ, నా కంటే ముందు చాలామంది నటులు విలక్షణమైన క్యారెక్టర్స్ చేశారు. అలాంటి వారే నాకు స్ఫూర్తి’’ అని హీరో విక్రమ్ అన్నారు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘ఇరుముగన్’ చిత్రాన్ని ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. విక్రమ్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అఖిలన్, లవ్ పాత్రలు నటుడిగా నాకు సంతృప్తినిచ్చాయి.
ఈ అవకాశం ఇచ్చిన దర్శక-నిర్మాతలకు కృతజ్ఞతలు. మా చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉండటం నాకు సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రం ‘సామి’కి సీక్వెల్‌గా ‘సామి 2’ చేయనున్నా’’ అని చెప్పారు. ‘‘నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నేను నిర్మాతగా మారి, విడుదల చేసిన మొదటి చిత్రం ‘ఇంకొక్కడు’. నా నమ్మకం వమ్ము కాకుండా ఈ చిత్రం విజయం సాధించింది. సినిమా విడుదలకు సహకరించిన ‘అభిషేక్ పిక్చర్స్’ అభిషేక్ నామాకు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. అభిషేక్, పలు జిల్లాల పంపిణీదారులు పాల్గొన్నారు.