ఇష్టకష్టాలు
ఉలి తీసుకుని చెక్కడం మొదలుపెడితే... విగ్రహం చూసిన ఆనందం కలుగుతుంది. కానీ విగ్రహానికి కలిగిన కష్టం అర్థం కాదు. విక్రమ్‌కి పాత్రలు విగ్రహాల్లాంటివి. ఆ పాత్రల్లో లీనమైపోవడం తనకు విగ్రహాన్ని ఆవహించడం లాంటిదే. విక్రమ్ చేసిన పాత్రల్లో క్లిష్టమైనవి చాలా ఉన్నాయి. ఆ పాత్రల్లో తను పడ్డ కష్టాన్ని మనతో పంచుకున్నారు విక్రమ్. మరొకరైతే అష్టకష్టాలు అనేవారు.. విక్రమ్ వీటిని ఇష్టకష్టాలు అంటున్నారు.
ఓన్లీ పండ్ల రసాలతో ఆరు నెలలు (‘సేతు’ 1999)
విక్రమ్: నా కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాల్లో ‘సేతు’ ఒకటి. ఆ సినిమా సెకండాఫ్‌లో మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిగా మారిపోతాను. దాని కోసం 16 కిలోల బరువు తగ్గాను. ఆరు నెలల పాటు ఓన్లీ పండ్ల రసాలు తీసుకున్నా. విగరస్‌గా వర్కవుట్లు చేశా. ఆ తర్వాత అదే బరువు మెయిన్‌టైన్ చేయడం కోసం ఒక ఎగ్‌వైట్, ఒక గ్లాసు బీట్‌రూట్ లేదా క్యారెట్ జ్యూస్, ఒక చపాతీ... రోజు మొత్తంలో ఇవి తీసుకున్నాను.
ఆకలనిపిస్తే, ఆ ఫీలింగ్‌ని మైండ్‌కి ఎక్కించుకోకుండా నా ఆలోచనలను డైవర్ట్ చేసేవాణ్ణి. ఆ సినిమాలో నా కాళ్లకు ఇనుప గొలుసులు కడతారు. వాటి తాలూకు మచ్చలు చాన్నాళ్లు ఉండిపోయాయ్. అవి చూసుకుని, ‘ఇవి సేతు’ గుర్తులు అని నవ్వుకునేవాణ్ణి. గతాన్ని మర్చిపోయిన వ్యక్తిగా కనిపించే పాత్రలో పెద్దగా జుత్తు ఉండదు. దానికోసం గుండు చేయించుకున్నాను. దాంతో వేరే సినిమా ఒప్పుకోలేదు. సరిగ్గా అప్పుడే తమిళ ఇండస్ట్రీలో స్ట్రైక్ జరగడం, రిలీజ్ టైమ్‌కి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం.. ఒకటే టెన్షన్. ఆ బాధను మర్చిపోలేను.
అప్పుడు కంటి చూపు తగ్గింది (‘కాశి’ 2001)
మలయాళంలో కళాభవన్ మణి చేసిన ‘వసంతి యుమ్ లక్ష్మియుమ్ పిన్నె న్యానుమ’కి రీమేక్ ‘కాశి’. మలయాళ సినిమా చూడగానే, ‘ఏం క్యారెక్టర్‌రా ఇది’ అనిపించింది. అంధుడిగా నటించాలంటే చాలెంజే. మణికి కొంచెం నల్లగుడ్డు కనిపించేది. నేను అది కూడా కనపడనివ్వకూడదనుకున్నాను. ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 10, 15 రోజులు చేశాక దర్శకుడు వినయన్ దగ్గరికెళ్లి నల్లగుడ్డు కనిపించనివ్వకుండా కళ్లు పెట్టి చూపిస్తే, ‘వావ్..’ అన్నారు. షూటింగ్ సమయంలో డైలాగ్ చెప్పేటప్పుడు నాకు తెలియకుండా కళ్లు మామూలు స్థితికి వచ్చేసేవి. ఒక నిముషం మాత్రమే పెట్టగలిగేవాణ్ణి.
అందుకే ప్రాక్టీస్ టైమ్ పెంచాను. దాంతో రెండు మూడు నిముషాలు నల్లగుడ్డు కనపడనివ్వకుండా కళ్లు స్టేబుల్‌గా పెట్టగలిగా. షూటింగ్‌లో ఎవరైనా సరిగ్గా చేయకపోతే టేక్స్ మీద టేక్స్‌తో చచ్చిపోయేవాణ్ణి. కళ్లు స్ట్రైన్ అయ్యేవి. తలనొప్పి, కళ్ల నొప్పి.. పరిస్థితి ఘోరంగా ఉండేది. డాక్టర్ అయితే, ‘నువ్వు రిస్క్ చేస్తున్నావ్.. సైట్ వస్తుంది’ అన్నారు. సినిమా పూర్తయిన నెలా నెలన్నరకు కూడా నా కంటి చూపు మామూలు కాలేదు. పేపర్ చదవలేకపోయేవాణ్ణి. టీవీ స్క్రీన్ బ్లర్‌గా కనిపించేది. ఆ తర్వాతసెట్ అయ్యింది.
అవి స్వీట్ పెయిన్స్ (శివపుత్రుడు 2003)
కాళ్లకు, పళ్లకు నరకం చూపించిన సినిమా ‘శివపుత్రుడు’. జనరల్‌గా నేను ఇంట్లో స్లిప్పర్స్ వేసుకుంటాను. కానీ, ‘శివపుత్రుడు’లో నా కాళ్లకు చెప్పులు ఉండవ్. పైగా స్మశానం, అడవుల్లో, రఫ్ రోడ్ల మీదే సీన్స్ ఉండేవి. అడవుల్లో సీన్స్ తీసినప్పుడు నా పాట్లు చూడాలి. రాళ్లు, ముళ్లు ఉండేవి. కాళ్లు పుండ్లు పడ్డాయి. పళ్లకు నలుపు రంగు వేయడానికి అరగంట, తీయడానికి మూడు గంటలు పట్టేది. వరుసగా నెల రోజులు ఇదే తంతు. ఫిజికల్‌గా ఇవన్నీ చేస్తే.. మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా కనిపించాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా కష్టపెట్టిన సినిమా ఇది. ఆ సినిమా చేసినన్నాళ్లు కాళ్ల నొప్పులు ఇబ్బందిపెట్టేవి. షూటింగ్ పూర్తయ్యాక ఆ నొప్పులు పోవడానికి చాన్నాళ్లు పట్టింది. అవన్నీ స్వీట్ పెయిన్స్ అన్నమాట.
పెరిగి... తగ్గాను (‘అపరిచితుడు’ 2005)
‘అపరిచితుడు’లో చేసిన రామానుజం, రెమో, అపరిచితుడు.. ఈ మూడు పాత్రలూ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ మూడు పాత్రల కోసం బరువు తగ్గి, పెరిగాను. రామానుజం సంప్రదాయబద్ధంగా ఉంటాడు. రెమో మోడ్రన్‌గా, అపరిచితుడు ఫెరోషియస్‌గా ఉంటాడు. ఈ మూడు పాత్రలకూ బాడీ లాంగ్వేజ్‌లో వ్యత్యాసం చూపించడానికి చాలా హోమ్‌వర్క్ చేశాను. ఈ సినిమా పెద్దగా కష్టపెట్టలేదు కానీ, బరువు పెరిగి, తగ్గడం కొంచెం ఇబ్బంది అనిపించింది.
నాన్నలానే బిహేవ్ చేసేవాణ్ణి (‘నాన్న’ 2011)
‘నాన్న’లో చేసిన కృష్ణ క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా రావడానికి పది రోజులు పట్టింది. ఇందులో స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్‌లా చేశా. చూపులు, నడక, మాట తీరు, భుజాలు ఎగరేయడం అన్నీ వాళ్లలానే చేయాలి. షూటింగ్‌లో అదే మూడ్‌లో ఉంటేనే సాధ్యమవుతుంది. ఎవరైనా పలకరించినా ఆ క్యారెక్టర్‌లానే సమాధానం ఇచ్చేవాణ్ణి. కృష్ణలానే నడిచేవాణ్ణి. ‘అయ్యయ్యో.. ఏమైంది’ అనేవారు. షూటింగ్ ప్యాకప్ చెప్పి, రూమ్‌కి వెళ్లి స్నానం చేసి, మోడ్రన్ డ్రస్ వేసుకుని అద్దం ముందు నిలబడి.. ‘విక్రమ్, యు ఆర్ విక్రమ్. రిలాక్స్, నువ్ కృష్ణవి కాదు’ అని చెప్పుకునేవాణ్ణి. ఈ సినిమా కోసం చెన్నై బస్‌స్టాండ్‌లో ఓ సీన్ చేశాం. కృష్ణ గెటప్‌లో నేను జనాల్లోకి వెళ్లా. కెమేరా ఎక్కడో ఫిక్స్ చేశారు. ఆటోలో బస్‌స్టాండ్‌కి వెళ్లా. సుమారు వందమంది ఉన్నారు. నన్నెవరూ గుర్తుపట్టలేదు. ఓ వ్యక్తి దగ్గరికి వెళితే, నా అవతారం చూసి, చిరాకుపడ్డాడు. అప్పుడు స్పెషల్లీ చాలెంజ్డ్ పీపుల్‌ని తల్చుకుని బాధపడ్డా.
‘ఐ’దేళ్లు కోల్పోయేలా చేసింది (‘ఐ’ 2015)
‘ఐ’ నాకు వెరీ చాలెంజింగ్. బాడీ బిల్డర్ పాత్ర కోసం మజిల్స్ పెంచాను. రియల్ బాడీ బిల్డర్‌లా మారిపోయాను. ఆ తర్వాత మోడల్‌గా చేసిన క్యారెక్టర్ కోసం మజిల్స్ ఉండకూడదని దర్శకుడు శంకర్ చెప్పారు. సన్నగా ఉండాలి. కానీ, ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలన్నారు. ఫేస్ గురించి కేర్ తీసుకుంటూ, తగ్గాను. కేవలం మూడు నెలల్లో తగ్గాను. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడే మనిషిగా చేసినప్పుడు ఇంకా తగ్గాను. అది మోస్ట్ చాలెంజింగ్ రోల్. నార్మల్‌గా తింటున్నప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యహ్నాం రెండు చపాతీలు, రాత్రిపూట ఓ సూప్, రెండు చపాతీలు తీనుకునేవాణ్ణి. కానీ, ఈ పాత్ర కోసం ఫుడ్ తగ్గించేశాను.
ఒకే ఒక్క ఎగ్ వైట్. సగం ఆపిల్, బనానా జ్యూస్. అంతే. రోజు మొత్తంలో 50 కేలరీలు మాత్రమే తినాలి. కానీ, అంతకు రెండింతలు కేలరీలు కరిగించాలి. 50 కేజీల బరువుకి చేరుకోవాలన్నది టార్గెట్. 52 వరకూ వచ్చాను. ప్రతి రెండు వారాలకు డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్ని టెస్టులు చేయించుకునేవాణ్ణి. ‘హార్ట్ రేట్ తేడా అవుతోంది. ఎసిడిటీ.. ఇంకా అన్నిటిలో సడన్‌గా ఫ్లక్చ్యువేషన్ వచ్చింది. ఏదైనా మేజర్ ఆర్గాన్స్ ఫెయిల్ అయితే మేం కాపాడలేం’ అని డాక్టర్ అన్నారు. అప్పుడు 52 కిలోల దగ్గర ఆపేశాను. సరైన ఆహారం లేకపోవడం, ప్రోస్థెటిక్ మేకప్ వల్ల మూడీగా ఉండేవాణ్ణి. చిరాకుపడేవాణ్ణి. ‘ఐ’ సినిమా వల్ల నా హెల్త్ స్పాయిల్ అవుతుందని తెలిసినా చేశా. ఈ సినిమా కారణంగా ఓ ఐదేళ్ల జీవితాన్ని కోల్పోయా. కానీ, చాలా పేరొచ్చింది. పోస్ట్‌మ్యాన్ నుంచి పాలవాడి వరకూ జాతీయ అవార్డు ఎందుకు రాలేదని అడిగారు. నా దృష్టిలో అదే పెద్దది.
⇔ ఒకప్పుడు పాస్తా, బర్గర్, పిజ్జా.. తినాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు అవి ఎన్నైనా తినగలిగేంత డబ్బు ఉంది. అయినా తినలేను. చేసే క్యారెక్టర్స్ కోసం నోరు కట్టేసుకున్నాను. మూడేళ్లకు ముందు అయితే మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. ఆ తర్వాత మా అమ్మాయి ఏ పిజ్జానో తింటుంటే.. నేనూ ఒక్కో స్లైస్ తింటున్నా.
⇔ నేను 15-20 చపాతీలు తినగలను. 25-30 ఇడ్లీలు తినగలను. కానీ, గడచిన పదీ పదిహేనేళ్లల్లో నా తిండి పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఒకప్పటిలా ఇప్పుడు తింటే సరిపడటంలేదు. జనరల్‌గా ఒక్క గులాబ్ జామ్‌కీ, ఐస్‌క్రీమ్‌కీ ఎవరూ లావు కారు. కానీ, నేనిప్పుడు ఒక్క గులాబ్ జామ్ తిన్నా బరువు పెరిగిపోతాను. కఠినమైన డైటింగ్ చేయడంవల్ల ఎంత తక్కువగా తిన్నా అది ఎక్కువే. ఒకప్పటిలా నేనెప్పటికీ 20 చపాతీలు, 30 ఇడ్లీలు తినలేనేమో.
అమ్మాయల కష్టం తెలిసింది (‘ఇంకొక్కడు’ 2016)
ఇప్పటివరకూ నేను డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. ‘ఇంకొక్కడు’లో మొదటిసారి రెండు పాత్రలు చేశాను. ఒకటి అఖిలన్. ఇది నార్మల్ క్యారెక్టర్. ఇంకోటి లవ్. అమ్మాయిలా కనిపించే అబ్బాయి లవ్. ఈ పాత్ర కోసం ఆరు నెలలు హోమ్‌వర్క్ చేశా. ఇలా కనిపించేవాళ్ల నడక, చూపులు ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేశా. నడవటం, చూడటం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కానీ, హీరోయిన్‌లా హెయిర్ స్టైల్ చేశారు.
మామూలుగా హీరోయిన్లు పది గంటల షూటింగ్‌కి ఏడు గంటలకే నిద్ర లేచి, హెయిర్ స్టైల్ చేసుకుని రెడీ అవుతుంటారు. నేనలా తయారు కావాల్సి వచ్చింది. నయనతారకు చేసిన హెయిర్ డ్రెస్సర్ నాకూ చేశారు. నయనతార కూడా టిప్స్ ఇచ్చింది. ఒక్కో సీన్‌కి డిజైనర్ డ్రెస్సులు వాడాం. అమ్మాయిల కష్టం తెలిసింది. ఆ క్యారెక్టర్ ఎలాంటి పెయిన్‌ని మిగల్చలేదు కానీ, లవ్‌లానే నడవడం, చేతులు అదోలా తిప్పడం, చూడటం చేసేవాణ్ణి. అది మార్చుకోవడానికి టైమ్ పట్టింది. - డి.జి. భవాని