inkokkadu
-
హీరో ఎవరో?
‘యముడు, సింగం 3’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ తమ తదుపరి సినిమాను ఎనౌన్స్ చేసింది. ‘ఇంకొక్కడు’ సినిమాతో దర్శకునిగా పరిచయం అయిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరంటూ ? ఒక చిన్న పజిల్‌ను అభిమానులకు వదిలేశారు. ‘గెస్ చేస్తూ ఉండండి’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది స్టూడియో గ్రీన్ సంస్థ. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. మధ్యలో ఉన్నది హీరో. ఆ హీరో ఎవరు? అనే సస్పెన్స్‌కి కొన్ని గంటల్లో ఫుల్స్టాప్ పెట్టనున్నారు. అయితే ఎక్కువ ప్రచారంలో ఉన్న పేరు విజయ్ దేవరకొండ. ఈ మధ్య ఆనంద్ శంకర్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు నచ్చిందనే వార్త షికారు చేస్తోంది. సో.. ఈ చిత్రంలో నటించబోయేది విజయ్ దేవరకొండ అని ఫిక్స్ అవుదామా? -
ఇష్టకష్టాలు
ఉలి తీసుకుని చెక్కడం మొదలుపెడితే... విగ్రహం చూసిన ఆనందం కలుగుతుంది. కానీ విగ్రహానికి కలిగిన కష్టం అర్థం కాదు. విక్రమ్‌కి పాత్రలు విగ్రహాల్లాంటివి. ఆ పాత్రల్లో లీనమైపోవడం తనకు విగ్రహాన్ని ఆవహించడం లాంటిదే. విక్రమ్ చేసిన పాత్రల్లో క్లిష్టమైనవి చాలా ఉన్నాయి. ఆ పాత్రల్లో తను పడ్డ కష్టాన్ని మనతో పంచుకున్నారు విక్రమ్. మరొకరైతే అష్టకష్టాలు అనేవారు.. విక్రమ్ వీటిని ఇష్టకష్టాలు అంటున్నారు. ఓన్లీ పండ్ల రసాలతో ఆరు నెలలు (‘సేతు’ 1999) విక్రమ్: నా కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ‘సేతు’ ఒకటి. ఆ సినిమా సెకండాఫ్‌లో మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిగా మారిపోతాను. దాని కోసం 16 కిలోల బరువు తగ్గాను. ఆరు నెలల పాటు ఓన్లీ పండ్ల రసాలు తీసుకున్నా. విగరస్‌గా వర్కవుట్లు చేశా. ఆ తర్వాత అదే బరువు మెయిన్టైన్ చేయడం కోసం ఒక ఎగ్‌వైట్, ఒక గ్లాసు బీట్రూట్ లేదా క్యారెట్ జ్యూస్, ఒక చపాతీ... రోజు మొత్తంలో ఇవి తీసుకున్నాను. ఆకలనిపిస్తే, ఆ ఫీలింగ్‌ని మైండ్‌కి ఎక్కించుకోకుండా నా ఆలోచనలను డైవర్ట్ చేసేవాణ్ణి. ఆ సినిమాలో నా కాళ్లకు ఇనుప గొలుసులు కడతారు. వాటి తాలూకు మచ్చలు చాన్నాళ్లు ఉండిపోయాయ్. అవి చూసుకుని, ‘ఇవి సేతు’ గుర్తులు అని నవ్వుకునేవాణ్ణి. గతాన్ని మర్చిపోయిన వ్యక్తిగా కనిపించే పాత్రలో పెద్దగా జుత్తు ఉండదు. దానికోసం గుండు చేయించుకున్నాను. దాంతో వేరే సినిమా ఒప్పుకోలేదు. సరిగ్గా అప్పుడే తమిళ ఇండస్ట్రీలో స్ట్రైక్ జరగడం, రిలీజ్ టైమ్‌కి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం.. ఒకటే టెన్షన్. ఆ బాధను మర్చిపోలేను. అప్పుడు కంటి చూపు తగ్గింది (‘కాశి’ 2001) మలయాళంలో కళాభవన్ మణి చేసిన ‘వసంతి యుమ్ లక్ష్మియుమ్ పిన్నె న్యానుమ’కి రీమేక్ ‘కాశి’. మలయాళ సినిమా చూడగానే, ‘ఏం క్యారెక్టర్రా ఇది’ అనిపించింది. అంధుడిగా నటించాలంటే చాలెంజే. మణికి కొంచెం నల్లగుడ్డు కనిపించేది. నేను అది కూడా కనపడనివ్వకూడదనుకున్నాను. ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 10, 15 రోజులు చేశాక దర్శకుడు వినయన్ దగ్గరికెళ్లి నల్లగుడ్డు కనిపించనివ్వకుండా కళ్లు పెట్టి చూపిస్తే, ‘వావ్..’ అన్నారు. షూటింగ్ సమయంలో డైలాగ్ చెప్పేటప్పుడు నాకు తెలియకుండా కళ్లు మామూలు స్థితికి వచ్చేసేవి. ఒక నిముషం మాత్రమే పెట్టగలిగేవాణ్ణి. అందుకే ప్రాక్టీస్ టైమ్ పెంచాను. దాంతో రెండు మూడు నిముషాలు నల్లగుడ్డు కనపడనివ్వకుండా కళ్లు స్టేబుల్‌గా పెట్టగలిగా. షూటింగ్లో ఎవరైనా సరిగ్గా చేయకపోతే టేక్స్ మీద టేక్స్‌తో చచ్చిపోయేవాణ్ణి. కళ్లు స్ట్రైన్ అయ్యేవి. తలనొప్పి, కళ్ల నొప్పి.. పరిస్థితి ఘోరంగా ఉండేది. డాక్టర్ అయితే, ‘నువ్వు రిస్క్ చేస్తున్నావ్.. సైట్ వస్తుంది’ అన్నారు. సినిమా పూర్తయిన నెలా నెలన్నరకు కూడా నా కంటి చూపు మామూలు కాలేదు. పేపర్ చదవలేకపోయేవాణ్ణి. టీవీ స్క్రీన్ బ్లర్‌గా కనిపించేది. ఆ తర్వాతసెట్ అయ్యింది. అవి స్వీట్ పెయిన్స్ (శివపుత్రుడు 2003) కాళ్లకు, పళ్లకు నరకం చూపించిన సినిమా ‘శివపుత్రుడు’. జనరల్‌గా నేను ఇంట్లో స్లిప్పర్స్ వేసుకుంటాను. కానీ, ‘శివపుత్రుడు’లో నా కాళ్లకు చెప్పులు ఉండవ్. పైగా స్మశానం, అడవుల్లో, రఫ్ రోడ్ల మీదే సీన్స్ ఉండేవి. అడవుల్లో సీన్స్ తీసినప్పుడు నా పాట్లు చూడాలి. రాళ్లు, ముళ్లు ఉండేవి. కాళ్లు పుండ్లు పడ్డాయి. పళ్లకు నలుపు రంగు వేయడానికి అరగంట, తీయడానికి మూడు గంటలు పట్టేది. వరుసగా నెల రోజులు ఇదే తంతు. ఫిజికల్‌గా ఇవన్నీ చేస్తే.. మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా కనిపించాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా కష్టపెట్టిన సినిమా ఇది. ఆ సినిమా చేసినన్నాళ్లు కాళ్ల నొప్పులు ఇబ్బందిపెట్టేవి. షూటింగ్ పూర్తయ్యాక ఆ నొప్పులు పోవడానికి చాన్నాళ్లు పట్టింది. అవన్నీ స్వీట్ పెయిన్స్ అన్నమాట. పెరిగి... తగ్గాను (‘అపరిచితుడు’ 2005) ‘అపరిచితుడు’లో చేసిన రామానుజం, రెమో, అపరిచితుడు.. ఈ మూడు పాత్రలూ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ మూడు పాత్రల కోసం బరువు తగ్గి, పెరిగాను. రామానుజం సంప్రదాయబద్ధంగా ఉంటాడు. రెమో మోడ్రన్‌గా, అపరిచితుడు ఫెరోషియస్‌గా ఉంటాడు. ఈ మూడు పాత్రలకూ బాడీ లాంగ్వేజ్‌లో వ్యత్యాసం చూపించడానికి చాలా హోమ్‌వర్క్ చేశాను. ఈ సినిమా పెద్దగా కష్టపెట్టలేదు కానీ, బరువు పెరిగి, తగ్గడం కొంచెం ఇబ్బంది అనిపించింది. నాన్నలానే బిహేవ్ చేసేవాణ్ణి (‘నాన్న’ 2011) ‘నాన్న’లో చేసిన కృష్ణ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రావడానికి పది రోజులు పట్టింది. ఇందులో స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్‌లా చేశా. చూపులు, నడక, మాట తీరు, భుజాలు ఎగరేయడం అన్నీ వాళ్లలానే చేయాలి. షూటింగ్లో అదే మూడ్‌లో ఉంటేనే సాధ్యమవుతుంది. ఎవరైనా పలకరించినా ఆ క్యారెక్టర్లానే సమాధానం ఇచ్చేవాణ్ణి. కృష్ణలానే నడిచేవాణ్ణి. ‘అయ్యయ్యో.. ఏమైంది’ అనేవారు. షూటింగ్ ప్యాకప్ చెప్పి, రూమ్‌కి వెళ్లి స్నానం చేసి, మోడ్రన్ డ్రస్ వేసుకుని అద్దం ముందు నిలబడి.. ‘విక్రమ్, యు ఆర్ విక్రమ్. రిలాక్స్, నువ్ కృష్ణవి కాదు’ అని చెప్పుకునేవాణ్ణి. ఈ సినిమా కోసం చెన్నై బస్‌స్టాండ్‌లో ఓ సీన్ చేశాం. కృష్ణ గెటప్‌లో నేను జనాల్లోకి వెళ్లా. కెమేరా ఎక్కడో ఫిక్స్ చేశారు. ఆటోలో బస్‌స్టాండ్‌కి వెళ్లా. సుమారు వందమంది ఉన్నారు. నన్నెవరూ గుర్తుపట్టలేదు. ఓ వ్యక్తి దగ్గరికి వెళితే, నా అవతారం చూసి, చిరాకుపడ్డాడు. అప్పుడు స్పెషల్లీ చాలెంజ్డ్ పీపుల్ని తల్చుకుని బాధపడ్డా. ‘ఐ’దేళ్లు కోల్పోయేలా చేసింది (‘ఐ’ 2015) ‘ఐ’ నాకు వెరీ చాలెంజింగ్. బాడీ బిల్డర్ పాత్ర కోసం మజిల్స్ పెంచాను. రియల్ బాడీ బిల్డర్‌లా మారిపోయాను. ఆ తర్వాత మోడల్‌గా చేసిన క్యారెక్టర్ కోసం మజిల్స్ ఉండకూడదని దర్శకుడు శంకర్ చెప్పారు. సన్నగా ఉండాలి. కానీ, ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలన్నారు. ఫేస్ గురించి కేర్ తీసుకుంటూ, తగ్గాను. కేవలం మూడు నెలల్లో తగ్గాను. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడే మనిషిగా చేసినప్పుడు ఇంకా తగ్గాను. అది మోస్ట్ చాలెంజింగ్ రోల్. నార్మల్‌గా తింటున్నప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యహ్నాం రెండు చపాతీలు, రాత్రిపూట ఓ సూప్, రెండు చపాతీలు తీనుకునేవాణ్ణి. కానీ, ఈ పాత్ర కోసం ఫుడ్ తగ్గించేశాను. ఒకే ఒక్క ఎగ్ వైట్. సగం ఆపిల్, బనానా జ్యూస్. అంతే. రోజు మొత్తంలో 50 కేలరీలు మాత్రమే తినాలి. కానీ, అంతకు రెండింతలు కేలరీలు కరిగించాలి. 50 కేజీల బరువుకి చేరుకోవాలన్నది టార్గెట్. 52 వరకూ వచ్చాను. ప్రతి రెండు వారాలకు డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్ని టెస్టులు చేయించుకునేవాణ్ణి. ‘హార్ట్ రేట్ తేడా అవుతోంది. ఎసిడిటీ.. ఇంకా అన్నిటిలో సడన్‌గా ఫ్లక్చ్యువేషన్ వచ్చింది. ఏదైనా మేజర్ ఆర్గాన్స్ ఫెయిల్ అయితే మేం కాపాడలేం’ అని డాక్టర్ అన్నారు. అప్పుడు 52 కిలోల దగ్గర ఆపేశాను. సరైన ఆహారం లేకపోవడం, ప్రోస్థెటిక్ మేకప్ వల్ల మూడీగా ఉండేవాణ్ణి. చిరాకుపడేవాణ్ణి. ‘ఐ’ సినిమా వల్ల నా హెల్త్ స్పాయిల్ అవుతుందని తెలిసినా చేశా. ఈ సినిమా కారణంగా ఓ ఐదేళ్ల జీవితాన్ని కోల్పోయా. కానీ, చాలా పేరొచ్చింది. పోస్ట్‌మ్యాన్ నుంచి పాలవాడి వరకూ జాతీయ అవార్డు ఎందుకు రాలేదని అడిగారు. నా దృష్టిలో అదే పెద్దది. ⇔ ఒకప్పుడు పాస్తా, బర్గర్, పిజ్జా.. తినాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు అవి ఎన్నైనా తినగలిగేంత డబ్బు ఉంది. అయినా తినలేను. చేసే క్యారెక్టర్స్ కోసం నోరు కట్టేసుకున్నాను. మూడేళ్లకు ముందు అయితే మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. ఆ తర్వాత మా అమ్మాయి ఏ పిజ్జానో తింటుంటే.. నేనూ ఒక్కో స్లైస్ తింటున్నా. ⇔ నేను 15-20 చపాతీలు తినగలను. 25-30 ఇడ్లీలు తినగలను. కానీ, గడచిన పదీ పదిహేనేళ్లల్లో నా తిండి పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఒకప్పటిలా ఇప్పుడు తింటే సరిపడటంలేదు. జనరల్‌గా ఒక్క గులాబ్ జామ్కీ, ఐస్‌క్రీమ్‌కీ ఎవరూ లావు కారు. కానీ, నేనిప్పుడు ఒక్క గులాబ్ జామ్ తిన్నా బరువు పెరిగిపోతాను. కఠినమైన డైటింగ్ చేయడంవల్ల ఎంత తక్కువగా తిన్నా అది ఎక్కువే. ఒకప్పటిలా నేనెప్పటికీ 20 చపాతీలు, 30 ఇడ్లీలు తినలేనేమో. అమ్మాయల కష్టం తెలిసింది (‘ఇంకొక్కడు’ 2016) ఇప్పటివరకూ నేను డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. ‘ఇంకొక్కడు’లో మొదటిసారి రెండు పాత్రలు చేశాను. ఒకటి అఖిలన్. ఇది నార్మల్ క్యారెక్టర్. ఇంకోటి లవ్. అమ్మాయిలా కనిపించే అబ్బాయి లవ్. ఈ పాత్ర కోసం ఆరు నెలలు హోమ్‌వర్క్ చేశా. ఇలా కనిపించేవాళ్ల నడక, చూపులు ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేశా. నడవటం, చూడటం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కానీ, హీరోయిన్లా హెయిర్ స్టైల్ చేశారు. మామూలుగా హీరోయిన్లు పది గంటల షూటింగ్‌కి ఏడు గంటలకే నిద్ర లేచి, హెయిర్ స్టైల్ చేసుకుని రెడీ అవుతుంటారు. నేనలా తయారు కావాల్సి వచ్చింది. నయనతారకు చేసిన హెయిర్ డ్రెస్సర్ నాకూ చేశారు. నయనతార కూడా టిప్స్ ఇచ్చింది. ఒక్కో సీన్‌కి డిజైనర్ డ్రెస్సులు వాడాం. అమ్మాయిల కష్టం తెలిసింది. ఆ క్యారెక్టర్ ఎలాంటి పెయిన్‌ని మిగల్చలేదు కానీ, లవ్లానే నడవడం, చేతులు అదోలా తిప్పడం, చూడటం చేసేవాణ్ణి. అది మార్చుకోవడానికి టైమ్ పట్టింది. - డి.జి. భవాని -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఇంకొక్కడు
-
నాకు స్ఫూర్తి వారే! : హీరో విక్రమ్
‘‘నా నట ప్రస్థానం ప్రారంభమై పాతికేళ్లయింది. ఇన్నేళ్ల ప్రయాణంలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. నన్ను విలక్షణ నటుడు అని అంటున్నారు. కానీ, నా కంటే ముందు చాలామంది నటులు విలక్షణమైన క్యారెక్టర్స్ చేశారు. అలాంటి వారే నాకు స్ఫూర్తి’’ అని హీరో విక్రమ్ అన్నారు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘ఇరుముగన్’ చిత్రాన్ని ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. విక్రమ్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అఖిలన్, లవ్ పాత్రలు నటుడిగా నాకు సంతృప్తినిచ్చాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక-నిర్మాతలకు కృతజ్ఞతలు. మా చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉండటం నాకు సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రం ‘సామి’కి సీక్వెల్‌గా ‘సామి 2’ చేయనున్నా’’ అని చెప్పారు. ‘‘నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నేను నిర్మాతగా మారి, విడుదల చేసిన మొదటి చిత్రం ‘ఇంకొక్కడు’. నా నమ్మకం వమ్ము కాకుండా ఈ చిత్రం విజయం సాధించింది. సినిమా విడుదలకు సహకరించిన ‘అభిషేక్ పిక్చర్స్’ అభిషేక్ నామాకు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. అభిషేక్, పలు జిల్లాల పంపిణీదారులు పాల్గొన్నారు. -
‘ఇంకొక్కడు’ మరింత ఉత్సాహాన్నిచ్చింది
విలక్షణ హీరో విక్రమ్ నటించిన తాజా సినిమా ‘ఇంకొక్కడు’. నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్లు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్.కె.ఆర్. ఫిలింస్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ నెల 8న విడుదల చేసిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. హీరో విక్రమ్ చెప్పిన విశేషాలు... ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేయాలనుకోలేదు. దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పగానే.. విలన్‌గా ఎవరు చేస్తే బాగుంటుందని చాలా డిస్కషన్స్ జరిగాయి. రెండు రోజుల తర్వాత దర్శకుడితో హీరోగానూ, విలన్‌గానూ నేనే చేస్తే ఎలా ఉంటుందని అడిగా. ‘వెరీ గుడ్ ఐడియా’ అన్నారు. ‘అపరిచితుడు’లోనూ, ‘ఐ’లోనూ సింగిల్ క్యారెక్టరే. కానీ, హీరో క్యారెక్టరైజేషన్లో మూడు భిన్నమైన పార్శ్వాలుంటాయి. నాకెప్పట్నుంచో డబుల్ యాక్షన్ చేయాలనే ఆశ ఉంది. ఈ సినిమాతో అది తీరింది. హీరో పేరు ‘అఖిల్’, రా ఏజెంట్. కోపం ఎక్కువ. సమస్య వస్తే.. ఎదుటివ్యక్తిని ముందు కొట్టి, తర్వాత మాట్లాడతాడు. విలన్ పేరు లవ్. ఓ శాస్త్రవేత్త. ప్రేమ, మంచితనం, మానవత్వం వంటి గుణాలు అసలు లేవు. రెండు క్యారెక్టర్లలో నటించడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ప్రతి సినిమాలోనూ హీరో కంటే విలన్‌కి కొంచం తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులోనూ విలన్ (లవ్) క్యారెక్టర్ లెంగ్త్ తక్కువే. కానీ, హీరోతో సమానమైన పవర్ఫుల్ క్యారెక్టర్. అఖిల్‌తో పాటు లవ్‌కీ మంచి పేరొచ్చింది. ఇది ప్రయోగాత్మక సినిమా కాదు, పక్కా కమర్షియల్ ఫిల్మ్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. తెలుగులో కృష్ణారెడ్డిగారు, తమిళంలో శిబు సినిమాను నిర్మించారు. కేవలం డబ్బులు పెడితే చాలనుకునే నిర్మాతలు కాదు. ప్రతి విషయం మీద అవగాహన ఉంది. మంచి నిర్మాతలతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆనంద్ శంకర్ మొదటి సినిమా ‘ఆరిమానంబి’ విడుదలకు ముందు చూసి, పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. కథేమైనా ఉందా? అని అడిగితే.. ఓ నెల టైమ్ తీసుకుని నా కోసం ఈ కథ రాశాడు. నయనతార, నిత్యా మీనన్ అయితేనే కథకు న్యాయం చేస్తారనుకున్నాం. ఇద్దరూ బాగా నటించారు. హ్యారిస్ జయరాజ్, నా కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, పాటలు హిట్. అల్బమ్‌లో అన్ని పాటలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తారు. ఈ సినిమా పాటలు, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్. ప్రస్తుతం కమర్షియల్ సినిమా చేయడమే రిస్క్. ‘ఇలాంటివి చాలా చూశాం’ అంటున్నారు ప్రేక్షకులు. అయినప్పటికీ ఆదరిస్తున్నారు. ‘ఇంకొక్కడు’ లాంటి డిఫరెంట్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈ విజయం మరిన్ని డిఫరెంట్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎంకరేజ్మెంట్ అందించింది. ‘‘మా ఎన్.కె.ఆర్ .ఫిలింస్ సంస్థ విడుదల చేసిన తొలి చిత్రమిది. వసూళ్లు బాగున్నాయి. విక్రమ్ నటనకు, చిత్రానికి మంచి పేరొచ్చింది. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. మా ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఈ రోజు (ఆదివారం) విశాఖలో విజయయాత్ర నిర్వహిస్త్తున్నాం. హీరో విక్రమ్‌తో సహా చిత్ర బృందమంతా 11 గంటలకు సి.యం.ఆర్ మాల్, 12 గంటలకు వి-మ్యాక్స్ థియేటర్‌ను సందర్శించనున్నాం’’ - నిర్మాత నీలం కృష్ణారెడ్డి -
'ఇంకొక్కడు' మూవీ రివ్యూ
టైటిల్ : ఇంకొక్కడు జానర్ : సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంభి రామయ్య సంగీతం : హారిస్ జయరాజ్ దర్శకత్వం : ఆనంద్ శంకర్ నిర్మాత : శింబు తమీన్స్ నటుడిగా తనకు తిరుగలేదని నిరూపించుకున్న చియాన్ విక్రమ్ చాలా రోజులుగా కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో మాత్రం వెనుక పడుతూనే ఉన్నాడు. ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుండటం కూడా విక్రమ్ ఫెయిల్యూర్స్‌కి కారణం అన్న టాక్ ఉంది. అయితే మరోసారి తానే హీరోగా, విలన్‌గా నటిస్తూ రూపొందించిన ఇంకొక్కడు(ఇరుముగన్) చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు చియాన్. మరి ఇంకొక్కడు, విక్రమ్‌కు సక్సెస్ ఇచ్చాడా..? కథ : మలేషియాలోని ఇండియన్ ఎంబసీ మీద ఓ 70 ఏళ్ల వృద్ధుడు దాడి చేసి 20 మంది భారతీయ పోలీసుల్ని చంపటంతో సినిమా మొదలవుతోంది. లవ్ (విక్రమ్) అనే కెమికల్ సైంటిస్ట్ రూపొందించిన ఓ డ్రగ్ వల్లనే వయసు అయిపోయిన వ్యక్తి కూడా దాడి చేయగలిగాడని తెలుస్తుంది. లవ్ రూపొందించిన స్పీడ్ డ్రగ్ తీసుకుంటే 5 నిమిషాల పాటు మనిషికి అద్వితీయ మైన శక్తి వస్తుంది. ఈ డ్రగ్‌ను ఉగ్రవాదులకు అమ్మే ఉద్దేశ్యంలో ఉంటాడు లవ్. అయితే ఎంబసీ మీద జరిగిన దాడితో ఎలర్ట్ అయిన ఇండియన్ పోలీస్, గతంలో లవ్ కేసును డీల్ చేసి, నాలుగేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న, రా ఆఫీసర్ అఖిలన్ వినోద్(విక్రమ్)కు ఈ కేసు బాధ్యతలను అప్పగిస్తారు. లవ్ కారణంగానే తన భార్యను పొగొట్టుకున్న అఖిల్, లవ్‌ను అంతమొందించడానికి నిర్ణయించుకుంటాడు. మరో రా ఆఫీసర్ ఆరుషి(నిత్యామీనన్)తో కలిసి మలేషియాలో అడుగుపెట్టిన అఖిల్ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చివరకు లవ్ కథను ఎలా ముగించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : జాతీయ స్థాయి నటుడిగా ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్న విక్రమ్ ఈ సినిమాతో మరోసారి తనలోని నటుణ్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. సిన్సియర్ రా ఆఫీసర్‌గా కనిపిస్తూనే గే లక్షణాలున్న క్రూయల్ సైంటిస్ట్, లవ్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్స్ చూపించిన విక్రమ్ నటుడిగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. రా ఆఫీసర్లుగా నయనతార, నిత్యామీనన్‌లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నయన్ గ్లామర్ షో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. నాజర్, తంబి రామయ్య లాంటి నటులు తమ పరిథి మేరకు అలరించారు. సాంకేతిక నిపుణులు : హీరో విక్రమ్‌తో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ రోల్ చేయించిన దర్శకుడు ఆనంద్ శంకర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ లాంటి నటీనటులను ఒప్పించిన దర్శకుడు అందుకు తగ్గ స్థాయిలో కథా కథనాలను సిద్ధం చేయలేకపోయాడు. యాక్షన్ సీన్స్, ట్విస్ట్‌లు అలరించినా.. చాలా చోట్ల సినిమా బాగా స్లో అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతోంది. కొన్ని సన్నివేశాలు ఏ మాత్రం లాజిక్ లేనట్టుగా అనిపిస్తాయి. విక్రమ్ లుక్స్, విలన్ క్యారేక్టరైజేషన్ లాంటి అంశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హారిస్ జయరాజ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే పాటలతో నిరాశపరిచిన హారిస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అలరించాడు. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : విక్రమ్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే పాటలు ఓవరాల్‌గా ఇంకొక్కడు, నటుడిగా విక్రమ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించినా, తన స్థాయికి తగ్గ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందించకపోవచ్చు. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఇంకొకడు రిలీజ్ వాయిదా
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇంకొకడు. విక్రమ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నయనతార, నిత్యామీనన్‌లు విక్రమ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందన్న వార్త వినిపిస్తోంది. కొంత కాలంగా తన స్ధాయికి తగ్గ సక్సెస్ సాధించటంతో విఫలమవుతున్న హీరో విక్రమ్, ఇరుముగన్ సినిమాతో భారీ కలెక్షన్ల మీద కన్నేశాడు. అందుకే తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 1న ఇంకొకడు సినిమాను రిలీజ్ చేస్తే ఆ తరువాత రోజే రిలీజ్ అయ్యే జనతా గ్యారేజ్ సినిమా నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ కూడా తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో తన సినిమాను వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్. ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 1న కాకుండా ఇంకొకడు సినిమాను సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
నా కెరీర్లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!
-
నా కెరీర్లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!
సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు విక్రమ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఇరుముగన్’. నయనతార, నిత్యామీనన్ కథానాయికలు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఎన్కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హరీష్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. స్నేహ గ్రూప్ ఎండీ వరుణ్‌రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ట్రైలర్ ఆవిష్కరించారు. విక్రమ్ పాటల సీడీని విడుదల చేసి రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు అందించారు. విక్రమ్ మట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన గొప్ప పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన అఖిలన్, లవ్ క్యారెక్టర్లు కూడా నిలుస్తాయని చెప్పగలను. మంచి కథ తయారు చేసుకుని దాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఆనంద్‌కు మంచి భవిష్యత్ ఉంది. తనతో మరో రెండు, మూడు చిత్రాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా, వ్యక్తిగా విక్రమ్ సూపర్. ఆయన నటనలో చీటింగ్ కనిపించదు. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలందరూ నెల్లూరుకు చెందిన వారే. కృష్ణారెడ్డి కూడా నెల్లూరివాసి కావడం సంతోషం’’ అని పేర్కొన్నారు. ఆనంద్ శంకర్ మాట్లాడుతూ- ‘‘ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే కారణం విక్రమ్గారే. తెలుగు ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయాలనుంది. ఈ చిత్రంలో విక్రమ్‌గారు రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు’’ అని చెప్పారు. ‘‘పది చిత్రాలు పంపిణీ చేశాను. నిర్మాతగా నాకిది తొలి చిత్రం. సెప్టెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నీలం కృష్ణారెడ్డి తెలిపారు. ఈ వేడుకలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజ్ కందుకూరి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగులోనూ భారీగా..!
చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విలక్షణ నటుడు విక్రమ్, ప్రయోగాలను మాత్రం ఆపటం లేదు. ప్రస్తుతం ఇరుముగన్ పేరుతో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామాలో హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తెలుగు మార్కెట్‌ను టార్గెట్ చేసిన విక్రమ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో ఇంకొకడు పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15న హైదరాబాద్‌లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో పలువురు తెలుగు తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆడియోను గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.