నా కెరీర్‌లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!
సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు విక్రమ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఇరుముగన్’. నయనతార, నిత్యామీనన్ కథానాయికలు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఎన్‌కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హరీష్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. స్నేహ గ్రూప్ ఎండీ వరుణ్‌రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ట్రైలర్ ఆవిష్కరించారు.
విక్రమ్ పాటల సీడీని విడుదల చేసి రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు అందించారు. విక్రమ్ మట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన గొప్ప పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన అఖిలన్, లవ్ క్యారెక్టర్లు కూడా నిలుస్తాయని చెప్పగలను. మంచి కథ తయారు చేసుకుని దాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఆనంద్‌కు మంచి భవిష్యత్ ఉంది. తనతో మరో రెండు, మూడు చిత్రాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా, వ్యక్తిగా విక్రమ్ సూపర్. ఆయన నటనలో చీటింగ్ కనిపించదు. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలందరూ నెల్లూరుకు చెందిన వారే.
కృష్ణారెడ్డి కూడా నెల్లూరివాసి కావడం సంతోషం’’ అని పేర్కొన్నారు. ఆనంద్ శంకర్ మాట్లాడుతూ- ‘‘ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే కారణం విక్రమ్‌గారే. తెలుగు ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయాలనుంది. ఈ చిత్రంలో విక్రమ్‌గారు రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు’’ అని చెప్పారు. ‘‘పది చిత్రాలు పంపిణీ చేశాను. నిర్మాతగా నాకిది తొలి చిత్రం. సెప్టెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నీలం కృష్ణారెడ్డి తెలిపారు. ఈ వేడుకలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రాజ్ కందుకూరి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.