వినోద్ ఖన్నా
వినోద్ ఖన్నా అంటే చాలామందికి అసూయ. జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాడని ఆయన గురించి అనుకుంటారు. దానికి కారణం కెరీర్ పీక్‌లో ఉండగా, బాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉండగా దాన్నంతటనూ కాలదన్ని రజనీష్ ఆశ్రమంలో సేవ చేయడానికి ఆయన అమెరికా వెళ్లిపోయాడు. రజనీష్ ఆధ్యాత్మికంగా ఏమి చెప్పినా ఆయన పట్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత గౌరవం ఉన్నా సగటు మనిషికి మాత్రం రజనీష్ ఆశ్రమంలో భౌతికపరమైన కట్టుబాట్లు ఉండవనీ ఎవరు ఎలా అయినా ఆనందాన్ని పొందవచ్చని ఒక నమ్మకం స్థిరపడిపోయింది.
దాని వల్ల వినోద్ ఖన్నా కూడా అలాంటి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఉంటాడని చాలామందికి జెలసీ. నిజానికి వినోద్ ఖన్నా చాలా అదృష్టవంతుడు. తండ్రిది కలిగిన కుటుంబం. దేశ విభజన సమయానికి పెషావర్ నుంచి ముంబై వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ ఖన్నా నాసిక్‌లో చదువుకున్నాడు. చాలా సిగ్గరి అయిన ఈ మనిషికి కాలేజీ రోజుల్లో వేసిన నాటకం ‘యాక్టింగ్ రుచి’ని చూపించింది. ఆ రోజుల్లో ఆయన చూసిన ‘సోల్వా సాల్’, ‘మొఘల్–ఏ–ఆజమ్’ సినిమాలు కూడా సినిమాల వైపు పురిగొల్పాయి.
‘రెండేళ్లు టైమ్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటా. లేకుంటే వ్యాపారం చేస్తా’ అని సినిమా రంగంలోకి వచ్చాడు. సునీల్ దత్ అతడి రూపాన్ని మెచ్చి ‘మన్ కా మీత్’ (1968)లో తొలి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వినోద్ ఖన్నా ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘సచ్చా ఝూటా’, ‘మేరా గావ్ మేరా దేశ్’ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశాడు. కాని దర్శకుడు, గేయ కర్త అయిన గుల్జార్ అతడి జీవితాన్ని మార్చాడు. గుల్జార్ తీసిన ‘మేరే అప్నే’, ‘అచానక్’ సినిమాలు వినోద్ ఖన్నాలోని నటుడిని బయటకు తెచ్చి అతని ఇమేజ్‌ను మార్చాయి.
ఒక వైపు అమితాబ్, మరోవైపు వినోద్ ఖన్నా సమానంగా కెరీర్‌లో ముందుకు సాగారు. వీరిద్దరూ కలిసి ‘హేరా ఫేరీ’, ‘ఖూన్ పసీనా’, ‘పర్వరీష్’, ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ముకద్దర్ కా సికిందర్’ వంటి పెద్ద హిట్స్ ఇచ్చారు. అమితాబ్ ఏకఛత్రాధిపత్యాన్ని వినోద్‌ఖన్నా తన్నుకుపోబోతున్నాడు అనే స్థితికి ‘ఖుర్బానీ’ వంటి మెగాహిట్స్‌తో వినోద్ ఖన్నా చేరుకోవడం ఆ సమయంలో అమితాబ్ చాలా ఆందోళన చెందడం ఇండస్ట్రీకి తెలుసు. కాని హఠాత్తుగా వినోద్ ఖన్నా రజనీష్ శిష్యుడిగా మారిపోయి అన్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు.
అయిదేళ్లు (1982–86) అమెరికాలో వినోద్ ఖన్నా వంట సహాయకుడిగా, తోటమాలిగా ఆశ్రమంలో పని చేశాడు. కాని త్వరలోనే విసుగుపుట్టి తిరిగి ముంబై చేరుకున్నాడు. వదిలేసి వెళ్లినదాన్ని తిరిగి పొందడం దాదాపు అసంభవం. కాని వినోద్ ఖన్నా తిరిగి సెకండ్ హయ్యస్ట్ (మొదటి స్థానం అమితాబ్‌ది) పెయిడ్ హీరోగా సినిమాలు చేశాడు. ‘జుర్మ్’, ‘చాందిని’, ‘దయావన్’ వంటి సినిమాలు అతడికి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాయి.
అయితే చాలా త్వరగానే వినోద్ ఖన్నా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత రాజకీయవేత్తగా తన మార్గాన్ని మార్చుకున్నాడు. నాలుగుసార్లు ఆయన ఎంపీగా గెలిచాడు. ఇలా నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన బాలీవుడ్ స్టార్లు లేరు. వినోద్ ఖన్నా మొదటి భార్య గీతాంజలి ద్వారా అతడికి అక్షయ్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రెండవ భార్య కవిత ద్వారా సాక్షి ఖన్నా, శ్రద్ధ కలిగారు. అక్షయ్ ఖన్నా బాలీవుడ్‌లో నటుడిగా రాణిస్తున్నాడు. వినోద్ ఖన్నా శ్రీమంతుడిగా పుట్టాడు.. శ్రీమంతుడిగానే చనిపోయాడు.
అందగాడిగా, మగటిమి ఉన్న పురుషుడిగా వినోద్ ఖన్నా గుర్తుంటాడు. ఆయన చేసిన ‘సింథాల్’ యాడ్‌ను ఎవరు మర్చిపోగలరు? ఆయన జీవించి ఉండగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఇచ్చి ఉంటే బాగుండేది. 2017 ఏప్రిల్ 27న మరణిస్తే సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పురస్కారం ప్రకటించారు.వినోద్ ఖన్నా అంటే ఒక సుదీర్ఘమైన ప్రయాణం. నువ్వు దారులు మార్చుకో, తోవ తప్పు, గెలువు, ఓడు.. కాని ఆగిపోకు.. నడుస్తూ ఉండు అని ఆయన తన ప్రయాణం ద్వారా చెప్పాడు. ఆయన పాట ద్వారానే ఆయనను గుర్తు చేసుకుందాం..‘రుక్ జాన నహీ కహి తూ హార్ కే... కాంటోంపే చల్ కే మిలేగే సాయే బహార్ కే...
Comments
Please login to add a commentAdd a comment