పాపులార్టీకి.. ప్రయోగానికి పట్టం | National Film Awards 2018 | Sakshi
Sakshi News home page

పాపులార్టీకి.. ప్రయోగానికి పట్టం

Published Sat, Apr 14 2018 2:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

National Film Awards 2018 - Sakshi

తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. 63వ జాతీయ అవార్డుల్లో ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’, ‘స్పెషల్‌ ఎఫెక్ట్స్‌’ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. 65వ జాతీయ అవార్డుల్లో   ‘బాహుబలి–2’ మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ‘బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌’గా జాతీయ అవార్డు దక్కించింది. అంతేకాదు.. బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌కి, బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌కి కూడా జాతీయ అవార్డులు దక్కాయి. మరో తెలుగు సినిమా ‘ఘాజీ’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుకి ఎంపికైంది. దర్శకుడు సంకల్ప్‌ రెడ్డికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇక.. ఇతర భాషల విషయానికొస్తే అస్సామీ ఫిల్మ్‌ ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ అవార్డు దక్కించుకుంది. దివంగత నటుడు వినోద్‌ ఖన్నాకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఇతర అవార్డు విజేతల వివరాలు, అవార్డు దక్కించుకున్న పలువురి ప్రముఖుల స్పందన ఈ విధంగా...

విలేజ్‌ రాక్‌స్టార్స్‌
65వ జాతీయ అవార్డులు అస్సామ్‌వారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే గడచిన 29 ఏళ్లల్లో అస్సామ్‌కి జాతీయ అవార్డు అందని ద్రాక్షే అయింది. ఈసారి ఏకంగా ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డుని దక్కించుకుంది ఓ అస్సామీ ఫిల్మ్‌. పేరు ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’. కథ చాలా చిన్నది. ‘జెన్యూన్‌ మూవీ’. అందుకే అవార్డు దక్కించుకుంది. 29 ఏళ్ల నుంచి నేషనల్‌ అవార్డు లేని లోటుని తీర్చిన సినిమా ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌. చివరిగా ఒక అస్సామీ సినిమా నేషనల్‌ అవార్డ్‌ అందుకున్నది 1987లో. జానూ బరువా తెరకెక్కించిన ‘హలోదియా చొరయా బావోధాన్‌ కాయ్‌’కు అప్పట్లో అవార్డు దక్కింది.అది కూడా ప్రాంతీయ చిత్రం విభాగంలో. 29 ఏళ్ల తర్వాత ఏకంగా బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కడం విశేషం. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ దర్శకురాలు ‘రిమా దాస్‌’ సెల్ఫ్‌మేడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. ఈ చిత్రాన్ని గౌహతిలోని తన స్వగ్రామం చాయగన్‌లోనే  కేవలం హ్యాండీ కెమెరాతో దాదాపు 150 రోజులు తెరకెక్కించడం విశేషం. సినిమా కథ చాలా సింపుల్‌ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్‌ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్‌ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది.

ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్‌ పర్ఫార్మెన్స్‌ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్‌ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్‌ సెకండ్‌ హ్యాండ్‌దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్స్‌ బుక్‌ చదివి తను కూడా ఓ బ్యాండ్‌ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను నాశానం చేస్తాయి. అప్పుడు దునుకి తన ప్రియారిటీ ఏంటో చూస్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలివిగా దును ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బనితా దాస్‌ ‘బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌’గా అవార్డు పొందింది. ఈ విలేజ్‌ రాక్‌స్టార్స్, మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలోనే కాకుండా ఎడిటింగ్, సౌండ్‌ రికార్డింగ్, బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ విభాగాల్లో కూడా అవార్డు గెలుచుకోవడం విశేషం. 65వ జాతీయ అవార్డుల ఎంపికలో బెస్ట్‌ పాపులర్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌ విభాగంలో మా ‘బాహుబలి 2’ సెలెక్ట్‌ అయినందుకు టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మా టీమ్‌ వర్క్‌ని గుర్తించి ఇదే చిత్రానికి యాక్షన్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో అవార్డులు ప్రకటించినందుకు కమిటీకి ధన్యవాదాలు. బెస్ట్‌ రీజినల్‌ తెలుగు ఫిల్మ్‌గా సెలెక్ట్‌ అయిన ‘ఘాజీ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు.
రాజమౌళి


టీమ్‌ వర్క్‌ని గుర్తించి ‘బాహుబలి–2’ చిత్రానికి బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్, బెస్ట్‌ యాక్షన్‌ అండ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌కు కృతజ్ఞతలు. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ‘ఘాజీ’ చిత్రబృందం రానా, సంకల్ప్‌రెడ్డి తదితరులకు శుభాకాంక్షలు. జాతీయ అవార్డులు గెలుచుకున్న అందరికీ... ముఖ్యంగా అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’కి శుభాకాంక్షలు.  
– ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ


శ్రీదేవిగారు అందరికీ ఓ తీయని జ్ఞాపకం – రవి ఉడ్యవర్‌
► ‘మామ్‌’ సినిమాకు బెస్ట్‌ యాక్ట్రెస్‌గా శ్రీదేవికి అవార్డు రావాటం డైరెక్టర్‌గా మీకెలా అనిపిస్తోంది?
మిక్స్‌ ఫీలింగ్స్‌. నా ఫస్ట్‌ సినిమాకే శ్రీదేవిగారికి నేషనల్‌ అవార్డు రావడం చాలా హ్యాపీ. ఇప్పుడు ఆ హ్యాపీనెస్‌ని సెలెబ్రేట్‌ చేసుకోవటానికి ఆమె మన మధ్య లేరని బాధగా ఉంది. ఆమె కూడా మనతో ఉండి ఈ అవార్డును సెలబ్రేట్‌ చేసుకుంటే బావుండు అనే చిన్న బాధ లోపల ఉంది. ఆమె ఫిజికల్‌గా మనతో లేకపోయినా మన మదిలో ఎప్పుడూ ఓ తీయని జ్ఞాపకంలా ఉంటారు.

► మామ్‌ మీకు ఫస్ట్‌ మూవీ, శ్రీదేవిగారికి 300వ సినిమా? ఆమె ఈ కథను అంగీకరిస్తారని అనుకున్నారా?
ఈ కథ సిద్ధం చేసుకున్నాక బోనీగారు ఒకసారి శ్రీకి కలిసి చెప్పు అన్నారు. కొంచెం భయంగానే ఉన్నా శ్రీదేవి గారు వద్దూ అనకూడదు అనేలాగా స్క్రిప్ట్‌ తీసుకువెళ్లాను. న్యారేషన్‌ అయ్యాక శ్రీదేవిగారు చాలా ఎమోషనల్‌గా ఫీల్‌ అయ్యారు. ఇది ఛాలెంజింగ్‌ ఫిల్మ్,  నేను చేస్తున్నాను అన్నారు. నా బెస్ట్‌ మూమెంట్స్‌లో అదొకటి.

► ఏదైనా సీన్‌లో శ్రీదేవిగారు కచ్చితంగా రెండు మూడు రీటేక్స్‌ తీసుకుంటారని మీరు అనుకొని ఆమె సింగిల్‌ టేక్‌లో చేసిన సీన్స్‌ ఉన్నాయా?
సినిమాలో ఒక హాస్పిటల్‌ సన్నివేశం ఉంటుంది. చాలా ఎమోషనల్‌ సీన్‌ అది. ఆ సీన్‌కు రెండు మూడు టేక్స్‌ తీసుకుంటారనుకున్నాను. జస్ట్‌ సింగిల్‌ టేక్‌లో చేసేశారు శ్రీదేవి గారు.

► మీ ఫస్ట్‌ సినిమానే శ్రీదేవిగారి ఆఖరి సినిమా అవ్వడం పట్ల మీ ఫీలింగ్‌?
నేను అలా ఆలోచించొద్దని డెసైడ్‌ అయ్యాను. ఈ సినిమా తర్వాత శ్రీదేవి గారు ఇంకా మంచి సినిమాలు చేస్తారనుకున్నాను. ఫ్రెష్‌ స్టార్ట్‌ నా సినిమా ద్వారా అవుతుందని ఆనంద పడ్డాను. ఎప్పటికీ ఆ ఆలోచనతోనే ఉంటాను.

► జాన్వీ, ఖుషీ వాళ్ల మామ్‌ను ‘మామ్‌’లో చూసుకున్నాక ఎలా ఫీల్‌ అయ్యారు?
ఖుషీ సినిమా చూసినప్పుడు నేను పక్కన లేను, కానీ జాన్వీ చూసిన వెంటనే చాలా ఎమోషనల్‌ అయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను గట్టిగా హగ్‌ చేసుకుంది.

► ఇప్పుడు జాన్వీ కూడా డెబ్యూ చేస్తున్నారు. తన గురించి ఏమైనా ?
షీ విల్‌ బీ అమేజింగ్‌. శ్రీదేవిగారిలాగే తను కూడా ఇండస్ట్రీలో సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

శ్రీదేవిగారికి సాంబార్‌ అన్నం అంటే ఇష్టం – కోన వెంకట్‌
► ‘మామ్‌’ ఒప్పుకున్నప్పుడు శ్రీదేవిగారు మీతో ఏమన్నారు?
‘ఇంగ్లిష్‌–వింగ్లిష్‌’ తర్వా త ఆమె ఎన్నో కథలు విన్నా ఏదీ ఒప్పుకోలేదు. ‘చేస్తే మంచి సినిమా చేయాలి, నా పిల్లలు గర్వపడేలా ఆ సినిమా ఉండాలనుకుంటున్నాను’ అని కథ చెప్పడానికి వెళ్లినప్పుడు అన్నారు. ‘మామ్‌’ కథ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. కొన్ని కథలు కొంతమంది ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళతాయి. అలా ‘మామ్‌’ శ్రీదేవిగారిని వెతుక్కుంటూ వెళ్లింది.

► అంటే..?
నాలుగేళ్ల క్రితం నేను న్యూయార్క్‌ వెళ్లినప్పుడు శ్రీదేవిగారి ఫ్యామిలీ అక్కడ ఉంది. అక్కడ అనుకోకుండా ఆ ఫ్యామిలీని కలిశాను. వాళ్లు తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి ఆహ్వానిస్తే వెళ్లాను. అప్పుడే ఓ స్టోరీ లైన్‌ ఉందంటూ ‘మామ్‌’ లైన్‌ చెప్పాను. ఆవిడ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నిజజీవితంలో పరిపూర్ణమైన తల్లిగా తన పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు. పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు. ఆవిడే ‘మామ్‌’కి కరెక్ట్‌ అనుకున్నాను. శ్రీదేవిగారు ఈ సినిమాలో జీవించేశారు. ఏ లోకంలో ఉన్నా ఈ అవార్డుకి ఆమె ఆనందపడతారు.

► ఈ సందర్భంగా శ్రీదేవిగారి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెబుతారా?
నమ్మరేమో. ఆవిడ చాలా బిడియస్తురాలు. అపరిచితులు ఉంటే అస్సలు మాట్లాడరు. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వాళ్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడరు. ఇన్ని సినిమాలు చేసిన ఈవిడ ఇలా ఉన్నారేంటి? అనుకున్నాను. అదే సన్నిహితులతో అయితే చాలా బాగా మాట్లాడతారు. జోకులు వేస్తుంటారు. ‘ఫన్‌ లవింగ్‌ పర్సన్‌’. హైదరాబాద్‌ వస్తున్నారంటే చాలు.. నాకు ఫోన్‌ చేస్తారు. ‘‘మీకు ‘ఉలవచారు’ హోటల్‌ ఉందట కదా. సాంబార్‌ అన్నం, గోంగూర అన్నం’ తెప్పిస్తారా’ అనేవారు. ఆ హోటల్‌ మాది కాదండి, నా ఫ్రెండ్‌ది అని, తెప్పించాను. ఆవిడకు అవి బాగా నచ్చేశాయ్‌. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అవే తినేవారు. శ్రీదేవిగారు వెజిటేరియన్‌. ఫుడ్‌ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండేవారు. మనకున్న గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. చాలా త్వరగా వెళ్లిపోయారు. బట్‌... తాను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ నిలిచిపోతారు.

నీకు చాలా త్వరగా జాతీయ అవార్డు వచ్చిందన్నారు
‘కాట్రు వెలియిడై’కి ఉత్తమ సంగీతదర్శకుడిగా, ‘మామ్‌’ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కి ఏఆర్‌ రెహమాన్‌కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా రెహమాన్‌ మాట్లాడుతూ – ‘‘కాట్రు వెలియిడై’కి జాతీయ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా గురువు, అన్నయ్య, గైడ్‌ మణిరత్నం నాకు చాలా స్పెషల్‌. ఆయనొక ఆలోచనల గని. మణిరత్నంతో మనం ఏ ఐడియా చెప్పినా దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు. అంత టాలెంట్‌ ఉంది. ‘రోజా’తో మా ప్రయాణం మొదలైంది.

ఆ సినిమాకి నాకు జాతీయ అవార్డు వస్తే ‘నీకు చాలా త్వరగా వచ్చింది’ అని కొందరు అన్నారు. కానీ, నేనలా అనుకోలేదు. ప్రజలు, నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలు, హీరోలు, నా టీమ్‌.. అందరికీ ధన్యవాదాలు. ఇక ‘మామ్‌’ విషయానికొస్తే.. ఈ సినిమాకి మ్యూజిక్‌ చేయాలని బోనీజీ, శ్రీదేవిజీ చెన్నై వచ్చినప్పుడు నన్ను అడిగారు. నేను ఆనందంగా అంగీకరించాను. ఇలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు. మంచి మెసేజ్‌ ఉన్న సినిమా. పైగా ఇప్పుడున్న పరిస్థితులకు చాలా అవసరమైన సినిమా. నాకీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బోనీజీ, శ్రీదేవిజీలకు ధన్యవాదాలు. ఆమె అద్భుతమైన నటి. శ్రీదేవిగారి ఆత్మ మనతోనే ఉందని నమ్ముతున్నాను’’ అన్నారు. ఉత్తమ గాయనిగా ‘కాట్రు వెలియిడై’ సినిమాకు జాతీయ అవార్డు దక్కించుకున్న శాషా తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు రెహమాన్‌.

ఈ క్షణాలు ప్రత్యేకమైనవి
‘మామ్‌’ సినిమాలో శ్రీదేవి నటనకు బెస్ట్‌ యాక్ట్రస్‌ అవార్డును జ్యూరీ కమిటీ కన్ఫార్మ్‌ చేసినప్పుడు మేం ఎంతగానో సంతోషించాం. ఈ క్షణాలు మాకు ఎంతో ప్రత్యేకమైనవి. శ్రీదేవి నటించిన 300 సినిమాల్లోనూ సేమ్‌ ఫర్‌ఫెక్షన్‌ను చూపించారు. ఆమె కేవలం సూపర్‌ యాక్టర్‌ మాత్రమే కాదు.

 
సూపర్‌ మామ్‌ అండ్‌ సూపర్‌ వైఫ్‌ కూడా. ఆమె జీవితంలో సాధించిన విజయాలను సెలబ్రేట్‌ చేసుకునే టైమ్‌ ఇది. ప్రస్తుతం ఆమె మాతో లేకపోవచ్చు. కానీ ఆమె వారసత్వం, జ్ఞాపకాలు మా వెంట ఇంకా జీవించే ఉన్నాయి. ఈ అవార్డుతో శ్రీదేవిని గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి జ్యూరీ మెంబర్స్‌కు ధన్యవాదాలు.  – బోనీ కపూర్‌







అన్నవరం టు వైజాగ్‌.. ఓ ‘ఘాజీ’ ఐడియా – సంకల్ప్‌ రెడ్డి
► దర్శకుడిగా మొదటి సినిమాకే నేషనల్‌ అవార్డ్‌ కొట్టేశారు.. హ్యాపీగా ఉండి ఉంటారు..
అఫ్‌కోర్స్‌. ఒక ఎక్స్‌పరీమెంటల్‌ మూవీని ముందు ప్రజలు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. ఐ యామ్‌ హ్యాపీ.

► ఇండియాలో ఫస్ట్‌ సబ్‌మెరైన్‌ మూవీ ‘ఘాజీ’. వర్కౌట్‌ అవుతుందా? అని కొందరు.. కొత్త కుర్రాడు సరిగ్గా తీయగలుగుతాడా? అని కొందరు.. ఈ మాటలు మీ వరకూ వచ్చాయా?
ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. అయితే రానాగారు, పీవీపీగారు నమ్మారు. నా స్క్రిప్ట్‌ని నేను బలంగా నమ్మాను. డిఫరెంట్‌ మూవీ ఇస్తే ప్రేక్షకులు చూస్తారనుకున్నాను. అది నిజమైంది.

► ఈ సినిమాని పీవీపీగారు నిర్మించే ముందు మీరే నిర్మించాలని కొంచెం డబ్బులు కూడా ఇన్వెస్ట్‌ చేశారు కదా?
అవును. పాకిస్తాన్‌ సబ్‌మెరైన్‌ సెట్‌ కూడా వేయించాను. అయితే సినిమా కంప్లీట్‌ చేసేంత మనీ లేదు. అప్పటికే నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో రానా ఈ సినిమాని నమ్మడం, పీవీపీగారు ముందుకు రావడంతో ‘ఘాజీ’ స్క్రీన్‌ మీదకు వచ్చింది.

► అసలు ‘ఘాజీ’ థాట్‌ ఎలా వచ్చింది?
2012లో నా పెళ్లయింది. అప్పుడు నా వైఫ్‌ (కీర్తీ రెడ్డి) బలవంతం చేస్తే అన్నవరం వెళ్లాం. అక్కణ్ణుంచి హైదరాబాద్‌ ట్రైన్‌ మిస్సవడంతో వైజాగ్‌ వెళ్లాం. అక్కడ బీచ్‌ రోడ్డులో సబ్‌మెరైన్‌ చూసినప్పుడు ఈ సినిమా థాట్‌ వచ్చింది.

► పెళ్లయిన వెంటనే సొంత డబ్బులు పెట్టి సినిమా తీయాలనుకోవడం, అది కూడా ప్రయోగం. మరి.. మీ మిసెస్‌ వద్దనలేదా?
(నవ్వుతూ). తను కూడా కొంత అమౌంట్‌ ఇచ్చింది. అమ్మానాన్న కూడా ఎంకరేజ్‌ చేశారు. వీళ్లతో పాటు ‘ఘాజీ’కి వర్క్‌ చేసిన టీమ్‌ చాలా కష్టపడ్డారు. అందువల్లే ఇంత మంచి ప్రాజెక్ట్‌ ఇవ్వగలిగా. నేనే ఈ సినిమా నిర్మించాలనుకున్నప్పుడు మనీ ఎరేంజ్‌ చేయడం నాకు పెద్ద సవాల్‌ అయింది. అంతకు మించి నాకేదీ సవాల్‌ అనిపించలేదు. ఒకవేళ అవార్డు రాకపోయినా మంచి థాట్‌ వస్తే కచ్చితంగా ఎక్స్‌పరీమెంటల్‌ మూవీ చేస్తాను. అయితే అవార్డ్‌ అనేది ఒక బూస్ట్‌ లాంటిది.

అవార్డ్స్‌ లిస్ట్‌
దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డ్‌ – వినోద్‌ ఖన్నా
బెస్ట్‌ డైరెక్టర్‌ : జయరాజ్‌ (‘భయానకం’ – మలయాళం)
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
బెస్ట్‌ రీజనల్‌ ఫిల్మ్‌ : లడఖ్‌
మరాఠి : కచ్చ లింబు
తెలుగు : ఘాజీ
మలయాం : తొండిముత్తాలుం ద్రిక్‌శాక్షయుం
హిందీ : న్యూటన్‌
బెంగాలీ : మయూరాక్షి
అస్సామీ : ఇషూ
తమిళ్‌ : టు లెట్‌
గుజరాతీ: డీ హెచ్‌ హెచ్‌
కన్నడ : హె బెట్టు రామక్క
బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ : పీటర్‌ హెయిన్‌ (బాహుబలి –2)
బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ : గణేష్‌ ఆచార్య
(టాయిలెట్‌ ఏక్‌ ప్రేమకథా)
బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ : ‘బాహుబలి 2’
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ : నగర్‌ కిర్టన్‌ చిత్రం
బెస్ట్‌ లిరిక్స్‌ : ముత్తూ రత్న (కన్నడ– ‘మార్చి22’)
బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ : ఏఆర్‌ రెహమాన్‌ (మామ్‌),
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ : ఏఆర్‌ రెహమాన్‌
(కాట్రు వెలియిడై)
బెస్ట్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ : రామ్‌ రజాక్‌ (నగర్‌ కిర్టన్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ : సంతోష్‌ రాజన్‌ (మలయాళం)
బెస్ట్‌ ఎడిటింగ్‌ : రీమా దాస్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే : తొండిముత్తాలుం ద్రిక్‌శాక్షయుం
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే : భయానకం
బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : శాషా తిరుపతి
బెస్ట్‌ మేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : ఏసుదాస్‌
బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌ : దివ్య దత్తా (ఇరాదా)
బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ : ఫాహద్‌ ఫాజిల్‌
బెస్ట్‌ యాక్ట్రెస్‌ : శ్రీదేవి (మామ్‌)
బెస్ట్‌ యాక్టర్‌ : రిద్దీ సేన్‌ (నగర్‌ కిర్టన్‌)
బెస్ట్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ మూవీ: దప్పా (మరాఠీ)
బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ : ‘బాహుబలి 2’
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement