అందాలతార శ్రీదేవి పుట్టినరోజు నేడు
బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో ఉన్నాడు అంటూ చిన్ననాడు పాడినా, సిరిమల్లె పూవా.. సిరిమల్లెపూవా.. చిన్నారి చిలకమ్మా అంటూ పదహారేళ్ల వయసులో అలరించినా, అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అని ప్రౌఢ వయసులోనూ హొయలు ఒలికించినా అన్నీ శ్రీదేవికే సొంతం. 50 ఏళ్ల వయసొచ్చినా ఏమాత్రం తగ్గకుండా ఇటీవలే వోక్ పత్రికకు కూడా పోజులిచ్చి, దేశవ్యాప్తంగా అభిమానుల మనసు కొల్లగొట్టింది.
అవును.. ఈరోజే అందాల తార శ్రీదేవి పుట్టినరోజు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం తమిళనాట పుట్టిన శ్రీదేవి.. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో లెక్కలేనన్ని చిత్రాల్లో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్)తో కలిసి అనేక సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె, ఆ తర్వతా ఆయన కుమారుడు నాగార్జున పక్కన కూడా హీరోయిన్గా నటించి మెప్పించడం విశేషం.
దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్లో రాజ్యమేలిన అతి కొద్ది మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. 1975లో బాలనటిగా జూలీ సినిమాలో నటించిన ఆమె, తాజాగా ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రం వరకు అనేక సినిమాలలో హీరోయిన్గా చేసింది. కుమార్తెలు జాన్వి, ఖుషీలతో కలిసి ఇటీవలి కాలంలో పలు కార్యక్రమాల్లో మెరుస్తున్న శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకోవడం అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ఐదు పదుల వయసు దాటినా కూడా వన్నె తరగని అందంతో వెలిగిపోతున్న శ్రీదేవికి 'సాక్షి' అందిస్తోంది.. జన్మదిన శుభాకాంక్షలు.