
ఫెఫ్సీకి 10 లక్షల విరాళాన్ని అందిస్తున్న విశాల్
తమిళ సినిమా : నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఒక వెబ్‌సైట్ నిర్వహస్తున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నై, చేట్‌పేట్‌లోని లేడీ ఆండాళ్ స్కూల్‌లో జరిగింది. కార్యక్రమంలో నటుడు కమలహసన్, విశాల్, ఫెఫ్సీ కార్యదర్శి ఆర్కే.సెల్వమణి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని నిర్వహించిన వెబ్‌సైట్ నిర్వాహకులు నిర్మాతల మండలి, నడిగర్‌సంఘానికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఆ చెక్కును నటుడు కమలహాసన్.. విశాల్‌కు అందించారు. ఆ మొత్తాన్ని విశాల్ ఫెఫ్సీ కార్యదర్శి ఆర్కే.సెల్వమణికి అందించారు. సమ్మె కారణంగా నెల రోజులకు పైగా షూటింగ్ జరగకపోవడంతో సినీ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకు రూ.10 లక్షలను అందిస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు.