సాక్షి, పెరంబూరు: ఈ నెల 22న హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ హైకోర్టుకు తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. 2015లో జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల్లో విశాల్ బృందం గెలుపొందిన విషయం తెలిసిందే. అప్పట్లో గత కార్యవర్గం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలతో సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి తదితరులపై చర్యలు తీసుకోనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై రాధారవి చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.
కేసు స్వీకరించిన న్యాయస్థానం విచారణ పూర్తయ్యే వరకూ రాధారవి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. విశాల్ తరపున కూడా ఎలాంటి చర్యలు చేపట్టబోమని వెల్లడించారు. అయితే కొన్నిరోజుల తరువాత రాధారవితో పాటు కొందరు మాజీ సభ్యులను సంఘం నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో విశాల్ వర్గం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రాధారవి హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై 19వ తేదీన కోర్టుకు హాజరై బదులివ్వాల్సిందిగా విశాల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ 19వ తేదీన విచారణకు విశాల్ గైర్హాజరయ్యారు. ఆయన తరపు న్యాయవాది హాజరై విశాల్ ఆనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయారని వివరించారు. దీంతో ఆ నెల 22న విశాల్ తప్పని సరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment