
క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు ఇకపై చెల్లించేది లేదని నిర్మాతల మండలి, థియేటర్ల యాజమాన్యం బుధవారం జరిపిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్( క్యూబ్, వీపీఎఫ్) చార్జీలు తగ్గించాలని నిర్మాతల మండలి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్మాతల మండలి ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను, ఈనెల 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు, సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి నిర్వాహకులు, థియేటర్ల మాజమాన్యం, ఫెఫ్సీ నిర్వాహకుల సమావేశం స్థానిక ఫిలిం చాంబర్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఇకపై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎలాంటి చార్జీలు చెల్లించేది లేదని, అవసరమైతే ఈ వ్యవహారంలో అందరూ కలిసి న్యాయపోరాటం చేయాలని తీర్మానం చేసినట్లు సమాచారం. అదే విధంగా సినిమా టిక్కెట్లను ఇకపై కంప్యూటర్ బుకింగ్ ద్వారా నిర్వహించాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కోరినట్లు, ఈ విధానాన్ని మరో 30 రోజుల్లో అమలు పరచాలని థియేటర్ల యాజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
అయితే ఈ విషయంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్‌సెల్వంకు పెద్ద మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. సొంత ప్రొజెక్టర్లు ఉండగా వీపీఎఫ్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని విశాల్ థియేటర్ల యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో వాగ్వాదానికి దారి తీసింది, అదే విధంగా ఆన్‌లైన్ బుకింగ్‌పై అదనంగా వసూలు చేసే రుసుమును తగ్గించాలన్న డిమాండ్ గురించి చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్‌సెల్వం, చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామిరామనాథన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment