ఆమెతో మాట్లాడాక రిలీఫ్ అయ్యా: విష్ణు
హైదరాబాద్ : తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ ప్రణీతకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు హీరోలు ఆమెకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రణీత ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మోత వద్ద ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రణీతతో పాటు వాళ్ల అమ్మ, సాయకురాలు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఖమ్మం లో ఓ వస్త్ర దుకాణంలో ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాగా తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ప్రణీత అనంతరం ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది. మినీ బస్సులో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రణీత అక్కడ నుంచి బెంగళూరు వెళ్లింది.
ప్రమాద వార్త తెలియడంతో హీరో నితిన్, మంచు విష్ణు..ప్రణీతకు ఫోన్ చేసి పరామర్శించారు. 'రియల్లీ ప్రణీతతో మాట్లాడిన తర్వాత రిలీఫ్ అయ్యా. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఆమె సేఫ్గా బయటపడింది. ఇది చూసి అయినా మనలో చాలామంది ఇకనుంచి సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది' అని మంచు విష్ణు ట్విట్ చేశాడు. డైనమెట్ చిత్రంలో మంచు విష్ణు, ప్రణీత కలిసి నటించారు. కాగా గతంలో మోతె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే.
Really relieved after talking to @pranitasubhash.God has been kind.she is safe cause of wearing the seat belt.Hope many of us learn frm this
— Vishnu Manchu (@iVishnuManchu) February 14, 2016