‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ కలిస్తే సాయిధరమ్ తేజ్. మా సినిమా కోసం 40 రోజులు షూటింగ్ చేశాం. ఏ రోజూ తను సెకండ్ టేక్ తీసుకోలేదు. అంత ఫోకస్‌గా ఉన్నాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్, పాటల విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఖుషి, బద్రి’ సినిమాల ఇన్‌స్పిరేషనే ‘జవాన్’ టైటిల్ సాంగ్.
రవి మంచి రచయిత. స్నేహితుడు రవి కోసం స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ సపోర్ట్ చేయడం హ్యాపీ. తేజ్, నేను చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జర్నీ ‘జవాన్’తో మరోసారి కంటిన్యూ అవుతుంది. తమన్ ఎక్స్‌ట్రార్డినరీ రీ–రికార్డింగ్ ఇచ్చాడు. డిఫరెంట్ అప్రోచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘బీవీయస్ రవి నా కాలేజ్‌మేట్. కృష్ణ కూడా నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి. తేజ్ చాలా పాజిటివ్ హీరో. నాకు కావాల్సిన వీరందరూ కలిసి చేస్తున్న ‘జవాన్’ హిట్ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ.
బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘తేజ్‌కి ఈ కథ చెప్పగానే సినిమా చేస్తానన్నాడు. నేను ఎంతో నిజాయతీతో, నిక్కచ్చిగా తయారు చేసుకున్న పాత్ర ఇది. అంతే నిజాయతీగా తేజ్ కష్టపడ్డాడు. ఇంటికో జవాన్ ఉండాలని చెప్పే సినిమా ఇది. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను తినే ప్రతి మెతుకుపైనా మా మావయ్యల (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్) పేర్లు ఉంటాయి. మా ఫ్యామిలీకి చిరంజీవి, పవన్ మావయ్యలు ఎలా జవాన్లుగా నిలబడ్డారో, అలా ప్రతి ఫ్యామిలీకి ఓ జవాన్ అండగా ఉంటాడు. కృష్ణగారు మేకింగ్‌లో రాజీపడలేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment