ఆస్కార్ తెర వెనక...ముందు | what is behind the oscar screen | Sakshi
Sakshi News home page

ఆస్కార్ తెర వెనక...ముందు

Published Sat, Feb 21 2015 6:27 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

ఆస్కార్ తెర వెనక...ముందు

ఆస్కార్ తెర వెనక...ముందు

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకున్నవారికి అదో మధుర స్మృతి. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నవారికీ అదో తీపి గుర్తు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేవారికీ ఓ మధురానుభూతి. రంగు రంగుల వెలుగు జిలుగుల మధ్య. తారల తళకుబెళకుల మధ్య ఆద్యంతం హృద్యంగా సాగే అవార్డుల కార్యక్రమం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఈసారి ఆస్కార్ పండుగ భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది.

అవార్డుల కార్యక్రమం రెడ్ కార్పెట్ స్వాగతంతో ప్రారంభమవుతుంది. అవార్డులతో సంబంధం లేకుండా రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తూ కెమేరాలకు పోజులివ్వడానికీ ఒక్క హాలీవుడ్ నుంచే కాకుండా పలు ప్రపంచ దేశాల హీరోయిన్లు పోటీ పడతారు. కేట్ విన్స్‌లెట్, నికోల్ కిడ్‌మన్ లాంటి అందాల తారలతో రెడ్ కార్పెట్‌పై నడవడానికి మన బాలీవుడ్ ఐశ్వర్య రాయ్ నాలుగైదు సార్లు పోటీ పడడం తెలిసిందే. ఆఖరికి తల్లయిన సమయంలో కూడా ఆమె రెడ్ కార్పెట్‌పై అందాలు చిందించడం అంటే ఆ రెడ్ కార్పెట్‌పై నడకలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ తారలకే కాకుండా డ్రెస్ డిజైనర్లకు కూడా ఇది పెద్ద పండుగే. ర్యాంప్‌లపై హొయలొలికించే మోడళ్లకు డ్రెస్ డిజైన్ చేయడం కంటే ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచే తారల డ్రెస్ డిజైన్‌కు వారు పోటీ పడతారు.

ఇక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే ఆతిథేయి (హోస్ట్) పాత్ర కూడా ఆషామాషీ కాదు. వేదిక పైకి రాకముందు హోస్ట్ కొన్ని వందల సార్లు రిహార్సల్ చేస్తారు. కార్యక్రమాన్ని పండించేందుకు సినిమాలు మొదలుకొని రాజకీయ, సామాజిక, తదితర అంశాలపై సెటైర్లు వేస్తారు. ఈ విషయంలో హోస్ట్‌కు తర్ఫీదు  ఇచ్చేందుకు ప్రత్యేకమైన బృందం ఉంటుంది. అవార్డుల ప్రదానం సందర్భంగా హోస్ట్‌కు ప్రాంప్టింగ్ చేయడానికి దాదాపు డజను మంది ఉంటారు. నటుడు, నిర్మాత ఓల్డే బిల్లీ క్రిస్టల్ ఏకంగా తొమ్మిది సార్లు హోస్ట్‌గా పనిచేశారు. సభికులను ఆకట్టుకునేందుకు కమెడియన్లను మారుతున్న ట్రెండ్‌ను అనుసరించి నిర్వాహకులు ఎంపిక చేస్తారు.

వేదికపై నుంచి అవార్డులు అందుకునే వారు ఏం మాట్లాడుతారనే అంశంపై వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు సభికులకు కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అవార్డులు అందుకున్న కొంతమంది అవార్డు రావడానికి కారణమైన సినిమా దర్శకుడు, నిర్మాత, తమతో పాటు పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బందితోపాటు భార్య, పిల్లలు, పని మనుషులు, ఇంట్లో పెంచుకుంటున్న బొచ్చు కుక్కకు కూడా థాంక్స్ చెబుతారనడం అతిశయోక్తి కాదు. ఎవరిని మరిచిపోతే ఏం గొడవొస్తుందనే భయం కావచ్చు. ఎందుకంటే 2008లో తాను నటించిన ‘మిల్క్’ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సియాన్ పెన్ వేదికపై నుంచి పేరు పేరునా అందరికీ థాంక్స్ చెప్పి భార్య రాబిన్ రైట్‌ పేరు మరిచిపోయాడట. ఇంటికెళ్లాక ఆ విషయమై ఆమె పెద్ద గొడవ చేసిందట. కారణమేదైనా ఆ తర్వాత కొంతకాలానికే వారు విడాకులు తీసుకున్నారు.

వేదికపై హఠాత్తుగా ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అవార్డులు తీసుకునే వారు ఉద్విగ్నానికి లోనై అవార్డులు ఇచ్చేవారిని (ఆడ, మగ) ప్యాసినేట్‌గా ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత స్టీవెన్  స్పీల్‌బెర్గ్ తన చిత్రం షిండ్లర్స్ లిస్ట్‌కు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ వచ్చినప్పుడు నిర్వాహకులు చెప్పినవారి నుంచి కాకుండా తన గురువు, ప్రముఖ జపాన్ దర్శకుడు అకిరా కురసోవా నుంచి అవార్డు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement