వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో కలకలం రేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజిత, ఆయన ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలు దక్షిణాదిలోని టీవీ చానెళ్లు పదేపదే ప్రచారం చేశాయి. అయితే ఈ వీడియోలో ఉన్నది తాము కాదని, మార్ఫింగ్ జరిగిందని వీరిద్దరూ వాదించారు. ఈ టేపుల్లో ఉన్నది ఎవరో తేల్చాలని కోర్టు కెక్కారు కూడా. వీడియో టేపులు ట్యాంపరింగ్ జరగలేదని బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ గతంలో స్పష్టం చేసింది. ఈ నివేదికను నిత్యానంద సవాల్ చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వీడియో ఉన్నది వీరిద్దరేనని తాజాగా నిర్ధారించడంతో నిత్యానంద, రంజిత వాదన అబ్ధమని తేలిపోయింది.
ఎవరీ రంజిత..?
తమిళనాడుకు చెందిన రంజిత 1975, జూన్ 4న జన్మించింది. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత ఆమె అగ్ర కథానాయకిగా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర కథానాయకులతో నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. ఆమె వాలీబాల్ క్రీడాకారిణి కూడా.
పెళ్లి-విడాకులు
సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత ఏడాది పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న రంజిత 2001లో మళ్లీ పునఃప్రవేశం చేసింది. సహాయ పాత్రల్లో నటిస్తూ, టీవీ షోలు కూడా చేసింది. 2007లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. చివరిసారిగా 2010లో మణిరత్నం ‘రావణన్’ సినిమాలో కనిపించింది.
వీడియోతో వెలుగులోకి..
స్వామి నిత్యానందతో ఏకాంతంగా గడిపిన వీడియో బహిర్గతం కావడంతో రంజిత పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సన్ టీవీ ఈ వీడియోను పదేపదే ప్రసారం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని రంజిత వాదించింది. తర్వాత కూడా ఆమె నిత్యానంద ఆశ్రమంలోనే ఉండిపోయింది. 2013, డిసెంబర్ 27న సన్యాసం స్వీకరించి ఆనందమయిగా పేరు మార్చుకుంది. బెంగళూరు శివారులోని నిత్యానంద ఆశ్రమంలో సన్యాసినిగా జీవితం గడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment