భారత్‌లోని ప్రజలకు నమ్మకాలు ఎక్కువ. ఈ నమ్మకాలనే పెట్టుబడి పెట్టుకుని కొందరు స్వామిజీలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ భారీగా సంపాదించారు. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు. అందులో ఒకరే స్వామి నిత్యానంద. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజితతో ఆయన ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాల్లో మార్మోగిపోయాయి.
2019లో దేశం విడిచి పరార్
అడ్డంగా దొరికిపోయినప్పటికీ అదంతా అబద్ధమని బుకాయించారు. అప్పటి నుంచి నిత్యానందను వివాదాలు చుట్టుముడుతూనే వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనే స్పష్టత లేదు. తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రియ శిష్యురాలు ప్రధానిగా
ఈ విషయాన్ని నిత్యానంద వెబ్‌సైట్‌లో పేర్కొన్నారని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది. కానీ సదరు వెబ్‌సైట్‌లో మాత్రం అటువంటి వివరాలేమీ కనిపించలేదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎవరీ రంజిత?
కన్నడ సినిమాల్లో నటించిన రంజిత అప్పటితరానికి సుపరిచితమే! తమిళనాడుకు చెందిన ఆమె 1975, జూన్ 4న జన్మించింది. సీనియర్ నటుడు అశోక్ కుమార్ కూతురే రంజిత. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది.
అక్కాచెల్లెళ్లు విడాకులిచ్చి నిత్యానంద చెంతకు
సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నారు. కానీ తర్వాత నిత్యానంద మాయలో పడటంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె 2013 చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతోపాటు దేశం వదిలి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment