చార్లెస్ శోభరాజ్ (ఫైల్).. 'మై ఔర్ చార్లెస్' సినిమాలో రణదీప్ హుడా (కుడి)
సినిమా కంటే ఎక్కువగా ప్రైమ్ టైమ్ లో క్రైమ్ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియానే యువతకు నేర సంబంధిత విషయాలు చెబుతుందంటున్నాడు బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. మరి ఆయన తాజా చిత్రం 'మై ఔర్ చార్లెస్' ఏమైనా శాంతిప్రవచనాలు బోధిస్తుందా? అని ప్రశ్నిస్తే మాత్రం డొంక తిరుగుడుగా..
'మేము తెరకెక్కిస్తున్న చార్లెస్ శోభరాజ్ సాధారణ వ్యక్తేమీ కాదు. అతని ప్రతి అడుగు ఓ సంచలనమే. బికినీ కిల్లర్ గా పేరు పొందిన ఆయన దేశంలోనే అత్యంత పటిష్ఠమైన తీహార్ జైలు నుంచి పారిపోయాడు. ఫ్రాన్స్ ఫ్యాషన్ రంగంలో పాదం మోపాడు ఎన్నెన్నో దేశాల్లో ఎన్నెన్నో నేరాలు.. ఇలాంటి ట్విస్టుల కంటే ఒక సినిమా కథకు ఇంకేం కావాలి చెప్పాండి' అంటూ సమాధానమిచ్చాడు.
ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరి.. ప్రస్తుతం కఠ్మాండు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు చార్లెస్ శోభరాజ్. అతడిని పట్టుకునే క్రమంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఓ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ పుస్తకం రాశారు. దాని ఆధారంగా దర్శకుడు ప్రవాల్ రమణ్ 'మై ఔర్ చార్లెస్' సినిమా తీశారు. చార్లెస్ శోభరాజ్ పాత్రలో రణదీప్ హుడా, రిచా చడ్డా, ఆదిల్ హుస్సేన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది.