Bikini Killer
-
చార్లెస్ శోభరాజ్ ఆందోళన
కట్మాండ్: ఉగ్రవాద సంస్థలకు తాను ఆయుధాలు సరఫరా చేశానని గతంలోనే ప్రకటించిన సీరియల్ బికినీ కిల్లర్, అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్ ఆందోళన చెందుతున్నాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శోభరాజ్‌కు ఇటీవల గుండెపోటు వచ్చింది. ఈ శనివారం శోభరాజ్‌కు కట్మాండులోని గంగాలాల్ హార్ట్ సెంటర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. అయితే ఆపరేషన్ తర్వాత తాను బతికే ఉంటానన్న నమ్మకం లేదని.. ఇలాగా తాను కొందరికి ఫోన్ చేయాలని అందుకు పర్మిషన్ ఇవ్వాలని జైలు అధికారులను శోభరాజ్ కోరాడు. శోభరాజ్ గుండెలో ఓ వాల్వ్ పూర్తిగా దెబ్బతిందని త్వరగా వైద్యం చేయాలని డాక్టర్లు అతడికి సూచించారు. అయితే తన సొంత దేశమైన ఫ్రాన్స్ లోని ప్యారిస్‌లో సర్జరీకి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అవకాశం ఇవ్వలేదు. ఫ్రాన్స్‌లో అయితే ఆపరేషన్ రిస్క్ 1 శాతం ఉండగా, కట్మాండులో మాత్రం రిస్క్ 3-5శాతం ఉంటుంది. దీంతో తన ప్రాణాలు పోతాయన్న భయం శోభరాజ్‌కు పట్టుకుందని ఆయనకు గత ఐదేళ్లుగా ట్రీట్మెంట్ ఇస్తున్న సీనియర్ డాక్టర్ తెలిపారు. ఓ వాల్వ్ దెబ్బతిన్నది. జూన్ 10న సర్జరీ నిర్వహిస్తాం. అతడి పరిస్థితి నార్మల్‌గానే ఉంది కానీ అతడిలో ప్రాణభయం పెరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. '2016 చివరలో జైలు నుంచి విడుదలై ఫ్రాన్స్ వెళ్లి సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను. నేపాల్ సుప్రీంకోర్టులో ఇటీవల విచారణకు హాజరు కాగా.. నేపాల్ లోనే నువ్వు చావడం ఖాయమని నాపై కేసు వేసిన వ్యక్తి బెదిరించాడు. దీంతో ప్యారిస్‌లో సర్జరీ చేయించుకునేందుకు పర్మిషన్ ఇప్పించాలని ఫ్రాన్స్ ఎంబసీకి నేను రాశాను. ఆరోగ్యం బాగాలేని కారణంగా త్వరగా విడుదల చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తాను. కట్మాండు నుంచి ప్యారిస్ వెళ్లి నేను చేయాల్సిన పనులు పూర్తిచేయాలని భావిస్తున్నానని' చార్లెస్ శోభరాజ్ చెప్పినట్లు సమాచారం. ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరిన శోభరాజ్.. న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో సెక్యూరిటీ సిబ్బందికి మత్తు మందు ఇచ్చి 1986లో పరారయ్యాడు. ఆపై అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండు జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. 2003లో ఓ క్యాసినో నుంచి తప్పించుకునే క్రమంలో కట్మాండు పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
'బికినీ కిల్లర్'పై సినిమా చేస్తే తప్పేంటి?
సినిమా కంటే ఎక్కువగా ప్రైమ్ టైమ్ లో క్రైమ్ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియానే యువతకు నేర సంబంధిత విషయాలు చెబుతుందంటున్నాడు బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. మరి ఆయన తాజా చిత్రం 'మై ఔర్ చార్లెస్' ఏమైనా శాంతిప్రవచనాలు బోధిస్తుందా? అని ప్రశ్నిస్తే మాత్రం డొంక తిరుగుడుగా.. 'మేము తెరకెక్కిస్తున్న చార్లెస్ శోభరాజ్ సాధారణ వ్యక్తేమీ కాదు. అతని ప్రతి అడుగు ఓ సంచలనమే. బికినీ కిల్లర్ గా పేరు పొందిన ఆయన దేశంలోనే అత్యంత పటిష్ఠమైన తీహార్ జైలు నుంచి పారిపోయాడు. ఫ్రాన్స్ ఫ్యాషన్ రంగంలో పాదం మోపాడు ఎన్నెన్నో దేశాల్లో ఎన్నెన్నో నేరాలు.. ఇలాంటి ట్విస్టుల కంటే ఒక సినిమా కథకు ఇంకేం కావాలి చెప్పాండి' అంటూ సమాధానమిచ్చాడు. ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరి.. ప్రస్తుతం కఠ్మాండు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు చార్లెస్ శోభరాజ్. అతడిని పట్టుకునే క్రమంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఓ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ పుస్తకం రాశారు. దాని ఆధారంగా దర్శకుడు ప్రవాల్ రమణ్ 'మై ఔర్ చార్లెస్' సినిమా తీశారు. చార్లెస్ శోభరాజ్ పాత్రలో రణదీప్ హుడా, రిచా చడ్డా, ఆదిల్ హుస్సేన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది. -
'తాలిబాన్లకు ఆయుధాలు సరఫరా చేశాను'
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ కు తాను ఆయుధాలు సరఫరా చేశానని సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్ గా పేరొందిన చార్లెస్ శోభరాజ్ వెల్లడించారు. తీహార్ జైల్లో జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్ తనకు పరిచయం ఏర్పడిందని శోభరాజ్ తెలిపారు. అంతేకాకుండా అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో కూడా గతంలో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. 1999 డిసెంబర్ లో కాట్మండ్ నుంచి కాంధార్ వెళ్లే ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ తర్వాత ప్రయాణికులను విడిపించేందుకు మసూద్ తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిచిపెట్టారని.. ఆతర్వాత తాను మసూద్ లు కలుసుకున్నామని.. ఆయుధాల కోసం తాలిబాన్లు మాదక ద్రవ్యాలను అమ్మేవారని శోభరాజ్ తెలిపారు. మసూద్ తో ఉన్న పరిచయంతో తాలిబాన్లకు చైనా నేరస్థులతో కలిసి ఆయుధాల డీలర్ గా పనిచేశానన్నారు. అరెస్ట్ అయ్యాక తనతో సీఐఏతో తెగతెంపులు చేసుకుందని, తనకు ఎలాంటి సహాయం చేయలేదని, ఉగ్రవాదంపై పోరాటానికి తాను తన ప్రాణాలను పణంగా పెట్టానని శోభరాజ్ అన్నారు. 2003లో ఇరాక్ యుద్ద సమయంలో సద్దాం హుస్సేన్ ఏజెంట్ ను తాను కలిశానని శోభరాజ్ అన్నారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి స్వీట్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చి 1986లో జైలు నుంచి పరారయ్యాడు. అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండ్ జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. శోభరాజ్ తన జీవిత కాలంలో 50 శాతం పలు నేరాల్లో శిక్ష అనుభవించాడు. తన జీవితంలో అనేక విషయాలను ఇటీవల మీడియాతో పంచుకున్నాడు.