టాప్ హీరోకు నోటీసులు
తిరువనంతపురం: మలయాళీ టాప్ హీరో మమ్ముట్టికి కేరళ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 'కసాబా' సినిమాలో మహిళలను కించపరిచారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మమ్ముట్టితో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడికి నోటీసులు ఇచ్చింది.
'కసాబా' సినిమాలో మహిళలను అగౌరపరిచేలా డైలాగులు, దృశ్యాలు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో నోటీసులు జారీ చేశామని మహిళా కమిషన్ చైర్పర్సన్ కే రోసకుట్టి టీచర్ తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో మహళలను కించపరచడం తగదని ఆమె అన్నారు. మమ్ముట్టి లాంటి పెద్దహీరో సినిమాల్లో ఇలాంటి దిగజారుడు డైలాగులు చెప్పడం, సన్నివేశాల్లో నటించడం సరికాదన్నారు. మహిళలను కించపరిచే డైలాగులు, సన్నివేశాలు లేకుండా చూడాలని సెన్సార్ బోర్డు, మలయాళం నటీనటుల సంఘం, సినీ టెక్నిషియన్స్ అసోసియేషన్ కు లేఖలు రాయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
రంజాన్ సందర్భంగా విడుదలైన 'కసాబా' హిట్ టాక్ సొంతం చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీనియర్ మహిళా పోలీసు అధికారిని హెచ్చరించే సన్నివేశంలో అభ్యంతకర డైలాగులు ఉన్నట్టు తెలుస్తోంది.