రచయిత చిన్నికృష్ణ
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మరణించలేదు.. తెలుగు మాట్లాడే ప్రజలందరి హృదయాల్లో జీవించే ఉన్నారు’’ అని రచయిత చిన్నికృష్ణ అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (బుధవారం (జులై 8)ని పురస్కరించుకుని చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘మీరు (వైఎస్) ఆ దేవుడు పంపించిన బిడ్డ సార్. ఆ పేద ప్రజల కోసం చేయాల్సిందల్లా చేసి, నిష్క్రమించారు. మీకు మరణం లేదు సార్. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కలిశాను. ఇప్పుడు ఒక విషయాన్ని తొలిసారి అందరికీ చెబుతున్నా. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్డు నంబర్ 14లో నేను ఉండేవాణ్ణి.
ఆ ముందు వీధిలో మీరు ఉండేవారు. జనార్ధన్‌గారు అనే ఆయన మీ వద్ద చాలా ఏళ్లుగా పనిచేసేవారు. మీకు బాగా ఆప్తుడాయన. ఆయనతో కలిసి ఎన్నోసార్లు మీ వద్దకు వచ్చాను. నా పుట్టినరోజున ఉదయాన్నే మీ వద్దకు వచ్చి మీ ఆశీస్సులు తీసుకుని వెళ్లాను. మీ అభిమానం, ఆప్యాయత, ప్రేమని ఎప్పటికీ మరువను. మీరు విలక్షణ రాజకీయ చతురుడే కాదు.. అవసరంలో ఉన్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు. పౌరుషానికి ప్రతినిధి, నిరుపేదల పాలిట ప్రత్యక్ష దైవం. రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడమే కాదు.. దాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి మీరు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment