నా కెరీర్ నిలబెట్టిన వ్యక్తి ఆయన
‘‘షారుక్ ఖాన్‌కు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 8న వైజాగ్‌లో జరపనున్న టీయస్సార్– టీవీ9 నేషనల్ ఫిలిం అవార్డు వేడుకలో ఆయనకు ‘మిలీనియమ్ స్టార్ అవార్డు’ను కూడా అందజేయనున్నాం’’ అని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్’ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన వేడుకలో హిందీ నటుడు షారుక్ ఖాన్‌కు ‘యశ్ చోప్రా మెమోరియల్’ అవార్డును ప్రదానం చేశారు.
షారుక్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చూడ్డానికి నేను అంత బాగుండను. అందుకని లవర్ బాయ్ కావాలనుకోలేదు. రొమాంటిక్ పాత్రలు చేసేంత అందగాణ్ణి కాదనుకునేవాణ్ణి. కానీ, యశ్ చోప్రా ‘నువ్వు లవ్‌స్టోరీస్ చేయకపోతే నీ కెరీర్ ఎదగదు’ అనేవారు. ఆయనలాంటి వ్యక్తి చెబితే దాంట్లో కచ్చితంగా అర్థం ఉంటుంది. నాతో లవ్‌స్టోరీస్ తీసి, నా కెరీర్‌ని నిలబెట్టారాయన’’ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు, నటుడు శత్రుఘ్న సిన్హా, నటీమణులు రేఖ, జయప్రద, పద్మినీ కోల్హాపురి, మాధురీ దీక్షిత్‌లతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.