
హరికుమార్‌ను కాపాడిన నవ నటుడు
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు హరికుమార్‌ను నవ నటుడు సుదర్శన్ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి కాపాడట. నవ నటుడేమిటి హరికుమార్‌ను కాపాడడం ఏమిటి? అనేగా మీ సందేహం. తూత్తుకుడి, మదురైసంభవం, బోడినాయకనూర్ గణేశన్, తిరుత్తం వంటి విభిన్న కథాచిత్రాల హీరో హరికుమార్ నటించిన తాజా చిత్రం కాదల్‌అగధి.
ఇందులో రెండో హీరోగా నవ నటుడు సుదర్శన్‌రాజ్ పరిచయం అవుతున్నారు. నటి ఆయిషా నాయకిగా నటించిన ఈ చిత్రంలో మరో నాయకిగా మమతా రావత్ నటించారు. పాండియరాజన్, దేవదర్శిని, సింగముత్తు, లొల్లుసభ మనోహర్, బ్లాక్‌పాండి, మైసూర్ మంజు, షామి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను షామీ తిరుమలై నిర్వహించారు.
చిత్రంలోని ప్రధాన అంశాల గురించి ఆయన తెలుపుతూ ఇందులో హరికుమార్ రెండు కోణాల్లో సాగే వైవిధ్యభరిత పాత్రను పోషించారన్నారు. రెండో హీరోగా నవ నటుడు సుదర్శన్‌ను పరిచయం చేసినట్లు చెప్పారు. ఈయన పాత్రకు చిత్రంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఒక దశలో హీరో హరికుమార్‌పై శత్రువులు దాడి చేసి చంపబోతే ఆయన వద్ద పని చేసే సుదర్శన్‌రాజ్ అడ్డుపడి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయన్ని కాపాడతాడన్నారు. చిత్రం అంతా హరికుమార్‌తో ఉండే సుదర్శన్‌రాజ్‌కు ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయన్నారు.
చిత్రం బాగా వచ్చిందని, ఇది విడుదలైన తరువాత సుదర్శన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు అన్నారు. తొలి చిత్రంతోనే హరికుమార్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని,ఈ కాదల్ అగధి చిత్రంలో నటించడం మంచి అనుభవం అని సుదర్శన్‌రాజ్ అన్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటున్న ఈ వర్ధమాన నటుడు మరో నూతన చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండడం విశేషం.