
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ‘యాత్ర’ సినిమాని నిర్మించి, విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ మహి, నిర్మాతలు విజయ్, శశి, శివగార్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందిస్తున్నా’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్‌లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాని సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని కోట్లమంది హృదయ అంచుల్లో, అంతరాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిగారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని, ప్రజల పట్ల ఆయనకున్న ఆరాటం, తపన, ఆయన ఆశయాలు, సంక్షేమ పథకాలను మరోసారి ప్రజల గుండె లోతుల్లో నుంచి తట్టి లేపారు. అందుకే నేను ‘యాత్ర’ యూనిట్‌ని అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాజశేఖర రెడ్డిగారిని ప్రజలు ఏ విధంగా నాయకునిగా నిలబెట్టుకున్నారో.. ఆయన కూడా ఓ తండ్రిగా మిమ్మల్ని (ప్రజలు) ఆదరించి మీకు ఏం కావాలో అవన్నీ చేశారు.
ఆయన వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిగారి కుటుంబాన్ని వదిలి పెట్టకుండా అక్కున చేర్చుకున్న ప్రజలందరికీ, రాజశేఖర రెడ్డిగారి నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాని ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్రలో నటించిన అశ్రిత మాట్లాడుతూ– ‘‘యాత్ర’ విడుదల తర్వాత ఎంతోమంది ఫోన్లు చేసి వైఎస్ విజయమ్మగారిలానే ఉన్నానని అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. విజయమ్మగారితో కలిసి ‘యాత్ర’ సినిమా చూసే అవకాశం రావడం హ్యాపీ. ఈ సినిమా చూసి విజయమ్మగారు సంతోషపడ్డారు. ఎప్పటినుంచో ఆమెను కలవాలనే నా కోరిక ఇప్పుడు తీరింది’’ అన్నారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన సినిమా ‘యాత్ర’. ఎటువంటి భేషజాలకు పోకుండా సినీ అభిమానులందరూ ‘యాత్ర’ లాంటి మంచి సినిమాని చూసి, ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలో చాలా బరువైన పాత్ర చేశా. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటుడు ‘దిల్’ రమేశ్ అన్నారు. విజయ్ చిల్లా, మహి వి. రాఘవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment