న్యూఢిల్లీ: దేశంలోని 10 ప్రసిద్ధ ప్రదేశాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించి ఆ ప్రాంతాలను గుర్తించింది. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో అంతర్జాతీయ నిపుణుల సాయంతో ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ప్రసిద్ధి పొందిన 10 చరిత్రాత్మక ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్వచ్ఛతను తీసుకురావాలని భావిస్తున్నట్లు కేంద్ర కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ వెల్లడించారు. కేంద్రం గుర్తించిన ప్రముఖ ప్రాంతాల్లో తాజ్‌మహల్ (ఆగ్రా), మణికర్ణిక ఘాట్ (ఉత్తరప్రదేశ్), వైష్ణోదేవీ (జమ్మూ కశ్మీర్), మీనాక్షి ఆలయం (మదురై), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), ఛత్రపతి శివాజీ టెర్మినస్ (మహారాష్ట్ర), అజ్మీర్ షరీఫ్ (రాజస్తాన్), స్వర్ణ దేవాలయం (పంజాబ్), కామాక్షి దేవాలయం (తమిళనాడు), జగన్నాథపురి (ఒడిశా) ఉన్నాయి.