తమిళనాడుకు ‘కావేరి’ విడుదల
కర్ణాటకలో మిన్నంటిన నిరసనలు
సాక్షి, బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక.. తమిళనాడుకు కావేరి నీటి విడుదల ప్రారంభించింది. మంగళవారం రాత్రి నుంచి కృష్ణరాజసాగర రిజర్వాయర్(కేఆర్‌ఎస్), హారంగి, కబిని, హేమావతి డ్యాంల నుంచి నీటిని విడుదల చేసింది. కేఆర్‌ఎస్ నుంచి 12వేల క్యూసెక్కులు, హారంగి నుంచి 2వేలు, కబిని నుంచి 5వేలు, హేమావతి నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కర్ణాటక రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనలకు కేంద్రమైన మండ్య జిల్లాతోపాటు కోలారు, మైసూరు, హసన్ తదితర జిల్లాల్లో రహదారులను దిగ్బంధించారు. బూతన హోసూరు వద్ద తమిళనాడుకు చెందిన ఆరు లారీలను ధ్వంసం చేశారు.
శ్రీరంగపట్నలో రైతులు నదిలోకి వెళ్లి నిరసన తెలిపారు. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరు-చెన్నై రైలును అడ్డుకున్నారు. కావేరి నీటిని తమిళనాడుకు ఇస్తే మండ్య, మైసూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ తాగునీరు కూడా లభించదని అన్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు కేఆర్‌ఎస్, కబిని, హేమావతి, హారంగి రిజర్వాయర్ల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాడుకు రోజుకు 15,000 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజులపాటు కావేరి నీరు ఇవ్వాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించడం తెలిసిందే.
తుంగభద్రలో 10 మంది గల్లంతు
శివమొగ్గ(కర్ణాటక): కర్ణాటకలో బుధవారం జరిగిన గౌరీ, వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాలను తుంగభద్ర నదిలో తెప్పలో తీసుకెళుతూ 10 మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందారు. ఈ ఘటన శివమొగ్గ జిల్లా హాడోనహళ్లిలో జరిగింది. తెప్పలోకి నీరు రావడంతో 12 మంది ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నారు. మిగిలిన 11 మంది తెప్పతో పాటు నదిలో మునిగిపోయారు.