
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విడదీసి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ధరావత్, గిరిజన నేతలు శంకర్ నాయక్, ఆంగోత్ గణేశ్ నాయక్‌ల ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు.
ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో గత నాలుగేళ్లుగా గిరిజనులకు హక్కుగా దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోండు, కోయ, కోలాం, లంబాడీ తెగల మధ్య విభేదాలు సృష్టిస్తూ గిరిజనుల నిజమైన సమస్యలను పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు. గిరిజన జనాభా 99 శాతం ఉన్న గిరిజన తాండాలు, గూడాల అభివృద్ధికి జిల్లా పరిషత్తుల ద్వారా వివిధ పద్దుల కింద నాలుగేళ్లుగా విడుదల కావాల్సిన రూ.20 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment