
ఓ సీఎం.. ఐదోతరగతి పాపకు ఇంటర్వ్యూ!!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవిస్కు ఇంటర్వ్యూలు కొత్త కాదు. కానీ, ఐదో తరగతి చదివే పాప ఆయనను ఇంటర్వ్యూ చేయాలనుకోవడమే వింత అనుకుంటే.. దానికి ఆయన స్పందించి, అధికారికంగా ఆమెను ఆహ్వానించి మరీ ఇంటర్వ్యూ ఇవ్వడం మరో పెద్ద విశేషం. దృష్టి హర్చంద్రాయ్ (11) అనే అమ్మాయి ముంబైలోని జేబీ పెటిట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం నివాసం ఉంటున్న సహ్యాద్రి గెస్ట్హౌస్ సమీపంలోని మలబార్ హిల్స్ వద్ద ఆమె ఉంటుంది. తన స్కూలు హోం వర్కులో భాగంగా సీఎం ఇంటర్వ్యూ తీసుకోవాలని దృష్టి భావించి.. ఆదివారం నాడు ఆయన ఇంటికెళ్లింది.
కానీ సెక్యూరిటీ గార్డులు ఆమెను తిప్పి పంపేశారు. దాంతో.. తన క్లాసు పుస్తకం లోంచి ఓ పేజీ చించి.. దానిమీద సీఎంకు ఏకంగా ఓ లేఖ రాసేసింది. సెక్యూరిటీ గార్డులు తనను లోనికి అనుమతించడం లేదని, ఈ లేఖ అందితే తన సెల్ఫోనుకు కాల్ చేయాలని కోరింది. తన అడ్రస్ కూడా ఇచ్చి, . వీలైతే ఎవరినైనా పంపి అధికారికంగా తనను ఆహ్వానించాలని కూడా అడిగింది. ఈ లేఖను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఓ ఫుట్నోట్ సైతం రాసింది. దాంతో.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాగ్పూర్ వెళ్లడానికి ముందే తన సిబ్బందిని పంపి, ఆమెను పిలిపించుకుని ఇంటర్వ్యూ ఇచ్చి.. ఆ చిన్నారి హోం వర్కు పూర్తయ్యేలా చూశారు!!