‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్‌ | Maharashtra Political Crisis: Eknath Shinde Takes Oath As Chief Minister | Sakshi
Sakshi News home page

‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్‌

Published Fri, Jul 1 2022 1:34 AM | Last Updated on Fri, Jul 1 2022 6:51 AM

Maharashtra Political Crisis: Eknath Shinde Takes Oath As Chief Minister - Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే.. రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర నూతన (20వ) ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే(58), ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌(51) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

రాత్రి 7.30 గంటల తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏక్‌నాథ్‌ షిండే తొలుత దివంగత శివసేన అగ్రనేతలు బాల్‌ ఠాక్రే, ఆందన్‌ డిఘేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని, రాష్ట్రంలో అన్ని వర్గాలను తనతోపాటు కలుపుకొని ముందుకెళ్తానని షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోనని అన్నారు. మహారాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. సీఎంగా తన నియామకం బాల్‌ ఠాక్రే సిద్ధాంతానికి, తన గురువు ‘ధర్మవీర్‌’ఆనంద్‌ డిఘే బోధనలకు లభించిన విజయమని వెల్లడించారు. 

ఫడ్నవీస్‌ను ఒప్పించిన బీజేపీ పెద్దలు 
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండడం లేదంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌ మొదట ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వ పరిపాలన సాఫీగా సాగడానికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కొద్దిసేపటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పందిస్తూ.. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో ఫడ్నవీస్‌ ఒక సభ్యుడిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో మంత్రివర్గంలో చేరడానికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఫడ్నవీస్‌ అంగీకరించినట్లు సమాచారం.

తదుపరి ముఖ్యమంత్రిగా షిండే పేరును ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం. అంతకముందు గురువారం మధ్యాహ్నం ఏక్‌నాథ్‌ షిండే గోవా నుంచి చార్టర్డ్‌ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ఫడ్నవీస్‌ను ఆయన నివాసంలో కలిసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌ నివాసం వద్ద ఆందోళనకు దిగిన కొందరు శివసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కొందరు బీజేపీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌కు బయలుదేరారు. గవర్నర్‌ కోషియారీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొందరు శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు ఫడ్నవీస్‌ వెల్లడించారు. రెబల్‌ ఎమ్మెల్యేలు ఒక శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిగా చేయగలరా? అంటూ తాజా మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విసిరిన సవాలుగా జవాబుగా ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదులుకున్నట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గం మద్దతుతో ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు సైతం వినిపించాయి. 

ఎన్నికలు రద్దుడాన్ని వ్యతిరేకిస్తున్నాం 
ఇది అధికారం కోసం జరిగిన పోరాటం కాదని ఫడ్నవీస్‌ అన్నారు. రాష్ట్రంపై ఎన్నికలను రుద్దడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 2019 నాటి ప్రజాతీర్పును ఉద్ధవ్‌ ఠాక్రే–కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి అపహాస్యం చేసిందని విమర్శించారు. బాలాసాహెబ్‌ బాల్‌ ఠాక్రే జీవితాంతం వ్యతిరేకించిన పార్టీలతో ఉద్ధవ్‌ నిస్సిగ్గుగా చేతులు కలిపారని మండిపడ్డారు. మహా వికాస్‌ అఘాడీ(ఏంవీఏ) సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. షిండే వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసమే తిరుగుబాటు 
మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం వెనుక వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవని ఏక్‌నాథ్‌ షిండ్‌ చెప్పారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశానని అన్నారు. ఏంవీఏ ప్రభుత్వంలో మంత్రులపై పరిమితులు విధించారని గుర్తుచేశారు. తన ఏకైక అజెండా అభివృద్ధి మాత్రమేనని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు గాను ఫడ్నవీస్‌పై షిండే ప్రశంసల వర్షం కురిపించారు. ఒక శివ సైనికుడిని సీఎంను చేస్తుండడం వెనుక ఫడ్నవీస్‌ పెద్ద మనసు ఉందన్నారు.

తిరుగుబాటు అనేది పార్టీలో జరిగిన ఒక అంతర్మథనం అని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు షిండే కృతజ్ఞతలు తెలియజేశారు. షిండేకు శివసేన, కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిపి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది శాసనసభ్యులు తనకు మద్దతుగా ముందుకొస్తారని ఆయన చెప్పారు. 

శాసనసభలో బలనిరూపణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా, శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కూటమికి 170 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గోవా నుంచి షిండే రాక సందర్భంగా ముంబై పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే.. 
ముంబైకి బయలుదేరడానికి కంటే ముందు షిండే గోవాలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి ముంబైకి వెళ్తున్నట్లు చెప్పారు. మిగతా ఎమ్మెల్యేలంతా ప్రస్తుతానికి గోవాలోనే ఉంటారని వివరించారు. తమ ఫిర్యాదులను ఎంవీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని షిండే తన అనుచరులకు సూచించారు. నూతన సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ప్రధానమంత్రి మోదీ అభినందలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు సైతం అభినందనలు తెలియజేశారు. 

షిండేకు ఉద్ధవ్‌ అభినందనలు 
మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్‌ షిండేకు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అభినందనలు తెలియజేశారు. 

ఈ నెల 2–3న అసెంబ్లీ భేటీ 
జూలై 2, 3 తేదీల్లో మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో తొలి మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. 

రెబల్స్‌కు విచారం తప్పదు: సంజయ్‌ రౌత్‌ 
తిరుగుబాటు ఎమ్మెల్యేలు వారి దారి వారు చూసుకున్నారని, అందుకు వారు ఎప్పటికైనా విచారించక తప్పదని శివసేన ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేల తీరు పట్ల తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే తరహాలో వస్త్రాలు ధరించిన వ్యక్తి ఫొటోను షేర్‌ చేశారు. ఈ ఫొటోలో సదరు వ్యక్తి వీపు భాగంలో రక్తపు మరకలు ఉన్నాయి. ఉద్ధవ్‌కు వెన్నుపోటు పొడిచారని సంజయ్‌ పరోక్షంగా వెల్లడించారు. సరిగ్గా ఇదే జరిగిందని ట్వీట్‌లో వివరించారు.

ఇకపై శివసేన రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన సమన్లపై వివరణ ఇవ్వడానికి శుక్రవారం అధికారుల వద్దకు వెళ్తానని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. రెబల్స్‌ వెళ్లే మార్గంలో తాము ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని, ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. వారి పని వారు చేసుకుంటారు, తమ పని తాము చేసుకుంటామని, తమ ఇరువురి దారులు వేరయ్యాయని వ్యాఖ్యానించారు. శివసేనలో తిరుగుబాటుకు కారణం ఎవరో తమకు తెలుసని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement