‘కాస్తంత ఊపిరి తీసుకోనివ్వండి. కొద్దిరోజులుగా బోలెడంత హడావిడిలో ఉన్నా!’ మహారాష్ట్ర శాసనసభలో సోమవారం నాటి విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే అన్న మాటలివి. ‘నేను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలసి కొత్తగా ఎవరిని మంత్రులుగా తీసుకోవాలో, వారికి ఏ శాఖలు కేటాయించాలో నిర్ణయిస్తాం’ అని ఆయన వివరించారు. రెండు వారాల రాజకీయ థ్రిల్లర్ తర్వాత సీఎం పదవి వచ్చి, సభలో బలం నిరూపించుకున్నా రన్న మాటే కానీ, బహుశా శిందే ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకొనే పరిస్థితి లేదు.
శివసేన అధినాయకత్వంపై తిరుగుబాటుతో చివరకు సీఎం అయిన గత పక్షం రోజుల కన్నా ఎక్కువ పని ఆయనకు ఉంది. శాసనసభలో బలపరీక్ష వేళ అనుకూలంగా 164 – ప్రతికూలంగా 99 ఓట్లతో సంఖ్యాబలం తనకే ఉందని శిందే ధ్రువీకరించగలిగారు. అయితే, పార్టీలోనూ, ప్రజల్లోనూ బలం తనకే ఉందని శిందే నిరూపించుకోవాల్సిన సందర్భాలు రానున్నాయి. తిరుగుబాటు వేళ పరిణామాలపై, గవర్నర్ చర్యలపై సుప్రీమ్‌కోర్టులో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. వెరసి మహానాటకం ముగిసిపోలేదు.
అయినవాడైన శిందే గద్దెనెక్కగానే రాజ్‌భవన్ సహా అందరూ అతిగా సహకరిస్తున్నారు. అభిప్రాయాలే మార్చేసుకుంటున్నారు. 17 నెలలుగా శాసనసభ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నా, సభలో ఎన్నిక పెట్టి దాన్ని నిర్వహించకుండా ఉపేక్షించిన ఘనత మహారాష్ట్ర గవర్నర్‌ది. తీరా శిందే, ఫడ్నవీస్‌ల కొత్త సర్కార్ కొలువు తీరగానే రెండే రోజుల్లో ఎన్నికకు అనుమతి, బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ గెలుపు చకచకా జరిగిపోవడం విడ్డూరం. మొన్నటిదాకా కొత్త స్పీకర్ ఎన్నికకు తేదీ నిర్ణయించడానికి నిరాకరిస్తూ వచ్చిన గవర్నర్‌లో ఈ హఠాత్ హృదయ పరివర్తనకు కారణమేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.
మొన్నటి దాకా అసెంబ్లీ నియమాల సవరణలపై వివాదం సుప్రీమ్‌లో పెండింగ్‌లో ఉందంటూ ఆయన సాకులు చెబుతూ వచ్చారు. తీరా ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్న సర్కారు రాగానే, కేసు సంగతి పక్కనబెట్టి స్పీకర్ ఎన్నికకు సిగ్నల్ ఇచ్చారు. స్పీకర్ ఎన్నికకు తేదీని నిర్ణయించడమే గవర్నర్ విధి. దాన్ని అడ్డం పెట్టుకొని, పూర్తిగా సభా వ్యవహారమైన స్పీకర్ ఎన్నికను గవర్నర్ ఇంతకాలం ఆపడం రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారూ రాజకీయాలకు అతీతులు కారనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఇక, గతంలో స్పీకర్ ఎన్నికంటూ జరిగితే, మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్ వేస్తారని అప్పటి ప్రతిపక్ష బీజేపీ భావిస్తూ వచ్చింది.
అప్పటికింకా శివసేనలో శిందే తిరుగుబాటు జరగనే లేదు. అందుకే, స్పీకర్ ఎన్నిక రహస్య ఓటింగ్‌లో సాగాలని కోరుతూ వచ్చింది. నాటి అధికార ఉద్ధవ్ ఠాకరే సర్కార్ మాత్రం క్రాస్ ఓటింగ్‌ను నివారించేందుకు ఓపెన్ బ్యాలెట్ విధానం కోరింది. అప్పుడు దాన్ని వ్యతిరేకించిన బీజేపీ తీరా శిందేతో కలసి తాము గద్దెనెక్కగానే ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరపడం అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకొనే వైఖరికి అచ్చమైన ఉదాహరణ.
‘మంత్రులు, శాఖల జాబితాలో బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పే మార్పులు చేర్పులను బట్టి నడుచుకుంటాం’ అంటున్న శిందే తమ కొత్త సర్కారు ఎవరి చెప్పుచేతల్లో నడిచేదీ చెప్పకనే చెప్పారు. అయితే, ప్రభుత్వంపై ప్రభావం చూపే అంశాలు కొన్ని కోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పాత హయాంలో కనీసం 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసుల వ్యవహారం, కొత్త స్పీకర్ ఎన్నిక అంశం అలాంటివే. రాజకీయంగా చూస్తే, మహారాష్ట్రలో పార్టీలు అధికారం వేటలో భాగస్వామ్య పక్షాలను నడిమధ్యలో వదిలేయడం, కొన్నాళ్ళకు మళ్ళీ చేతులు కలపడం ఆనవాయితీ. ముంబయ్ కార్పొరేషన్ ఎన్నికలు, శివసేన బలాన్నీ, బలగాన్నీ తన వైపు తిప్పేసుకొనే వ్యూహంతో అడుగేసిన బీజేపీ శిందేను ఎంతకాలం నెత్తిన పెట్టుకు మోస్తుందో చెప్పలేం. ఉద్ధవ్‌పై తిరగబడి వచ్చిన శిందే ముంబయ్‌లోనూ పట్టుసాధించి, అసలైన శివసేన, సైనికులం తామేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన రాజకీయ మనుగడ.
గతంలో నారాయణ రాణే, రాజ్ ఠాకరేల తిరుగుబాటును తట్టుకున్నా, ఈసారి పార్టీ, పార్టీ చిహ్నం కూడా చేజారే దురవస్థలో పడ్డ ఉద్ధవ్‌కి ఇది జీవన్మరణ సమస్య. మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను గంప కింద కోళ్ళలా కాపాడుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నారు. కొద్దిరోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలున్నందున ఈ ఎంపీలపై బీజేపీ జాలం తప్పదు. ఇప్పటికే 18 మంది శివసేన ఎంపీలలో 12 మంది తమ గూటికే వస్తారంటూ శిందే వర్గం ఎమ్మెల్యే ఒకరు చేసిన ప్రకటన సంచలనమైంది. గిరిజన మూలాలున్న ముర్మూకే మన మద్దతు ప్రకటిం చాలంటూ ఒక ఎంపీ మంగళవారం రాత్రే ఉద్ధవ్‌కు లేఖ కూడా రాయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో శిందే వైపు మొగ్గిన ప్రస్తుత ఛీఫ్ విప్ స్థానంలో లోక్‌సభలో మరొకరిని కొత్తగా నియమిం చడమే ఉద్ధవ్‌కి శరణ్యమైంది.
అసెంబ్లీలో బలపరీక్ష వేళ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ట్రాఫిక్, ఆలస్యమైంది లాంటి కుంటిసాకులు చెప్పి, ఓటింగుకు దూరమవడం ప్రతిపక్షాల్లో గుబులు రేపుతోంది. శరద్‌పవార్ మాత్రం శిందే, బీజేపీల దోస్తీ దీర్ఘకాలం సాగదనీ, కొత్త సర్కార్ నిలవదనీ బింకంగా చెబుతున్నారు. తన వెంట నిలిచిన ఎమ్మెల్యేలందరినీ తృప్తిపరచడం శిందేకు కత్తి మీద సామే. వరస చూస్తుంటే, శిందేకు ఇంకా చేతి నిండా చాలా పని ఉంది. పాపులర్ హిందీ డైలాగ్ ఫక్కీలో చెప్పాలంటే మహారాష్ట్రలో ‘పిక్చర్ అభీ బాకీ హై!'
Comments
Please login to add a commentAdd a comment