అంకుల్ ద్రోహం..12 ఏళ్ల బాలికకు నరకం
న్యూఢిల్లీ: ఒకవైపు మహిళలపై హింసకు వ్యతిరేకంగా వారోత్సవాలు. మరోవైపు దేశ రాజధాని నడిబొడ్డులో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం. ఉద్యోగం పేరుతో తీసుకొచ్చిన ఓ బాలికను రూ. 50వేలకు అమ్మేశాడో దుర్మార్గుడు. దగ్గరి బంధువే నమ్మించి... ద్రోహం చేయడంతో 12 ఏళ్ల బాలిక అంతులేని నరకాన్ని అనుభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని మధురైలో ఉంటున్న ఒడిషాకు చెందిన ఓ బాలికకు ఆమె సమీప బంధువు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఢిల్లీలో ఉద్యోగం ఉందని చెప్పి గుర్గావ్‌లోని పల్వాల్ గ్రామానికి తీసుకొచ్చాడు. నాలుగు నెలల తర్వాత తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడు. దీనికి బాలిక నిరాకరించడంతో మరో ఎత్తుగడ వేశాడు. 50 వేలకు ఆ బాలికను ఓ వ్యక్తికి అమ్మేశాడు. అప్పటి నుంచి ఆమెపై లైంగికదాడులు చేస్తూ నరకం చూపించాడు కొనుక్కున్న వ్యక్తి. ఆ కామాంధుడి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోతుండగా మరోసారి దురదృష్టం ఆమెను కాటేసింది. పల్వాల్ బస్టాండ్లో బస్సు కోసం చూస్తూ ఉండగా.. ఆటోలో వచ్చిన ఇద్దరు దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు పల్వాల్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తెలిపిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు గోవర్థన్, జితేందర్ అనే ఇద్దరు నిందితులను గుర్తించారు. కిడ్నాప్, అత్యాచారం, అనంతరం పొలాల్లో వదిలేసిన ఘటనలో వారిపై వివిధ చట్టాల కింద కేసులు పెట్టారు.
మరోవైపు బాలిక బంధువు, ఆమెను కొనుక్కున్న వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు. వారిపై లుక్ అవుట్ నోటీసు జారీచేశారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ కేంద్రానికి తరలించారు. విచారణ అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నామని తెలిపారు. అటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా కేంద్రాలుగా వ్యవస్థీకృతమైన అక్కమ సిండికేట్ పని చేస్తోందని అనుమానిస్తున్నారు. ఇలాంటి వ్యభిచార ముఠా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తమ దృష్టిలో ఉందన్నారు. దీనిపై ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.