అల్లుడు పక్కా స్కెచ్‌.. భార్యను ఇంటికి పంపకపోవడంతో.. | Uncle Assassination Due To Suspicious Of His Wife In Medchal District | Sakshi
Sakshi News home page

అల్లుడు పక్కా స్కెచ్‌.. భార్యను ఇంటికి పంపకపోవడంతో..

Published Sun, May 28 2023 7:00 PM | Last Updated on Fri, Jun 23 2023 5:58 PM

Uncle Assassination Due To Suspicious Of His Wife In Medchal District - Sakshi

దుండిగల్‌ పోలీసుల అదుపులో నిందితులు

రంగారెడ్డినగర్‌(మేడ్చల్‌ జిల్లా): భార్యను ఇంటికి పంపేందుకు అత్తమామలు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న అల్లుడు తన స్నేహితులతో కలిసి మామను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను దుండిగల్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు తెలిపిన మేరకు.. దుండిగల్‌ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన షేక్‌ నాసిర్‌ (31) అదే ప్రాంతానికి చెందిన రమేష్‌(37) కుమార్తె మహాలక్ష్మిని కిడ్నాప్‌ చేసి ముంబయ్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం తన బంధువుల ఇంట్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో అప్పట్లో దుండిగల్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

ఈ క్రమంలో బెయిల్‌పై విడుదలైన నాసిర్‌ శిక్ష పడటం ఖాయమని భయపడి బాధితురాలు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువురు చర్చిగాగిల్లాపూర్‌లోని సర్వే నెంబరు 214లో  కాపురం పెట్టారు. అయితే పెళ్లైన రెండు నెలల పాటు వీరి సంసారం సజావుగా కొనసాగింది. అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న నాసిర్‌ తరచూ ఆమెను  హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మహాలక్ష్మి  తండ్రి వద్దకు వెళ్లిపోయింది.

ఈ క్రమంలో భార్యను ఇంటికి పంపేందుకు నిరాకరించిన మామ రమేష్‌పై కక్షపెంచుకున్న నాసిర్‌ భార్యతో పాటు మామను సైతం చంపేందుకు పథకం పన్నాడు. తన స్నేహితులు  కోటేశ్వరరావు(24), కంచేరి మహేందర్‌(22)లు మెదక్‌ జిల్లా గడ్డపోతారం నుండి నాలుగు కత్తులను తెచ్చుకుని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.  2022 డిసెంబరు 16న రమేష్‌ ఇంటికి వచ్చిన నాసిర్‌ భార్య మహాలక్ష్మిని ఇంటికి పంపాలని అడగగా నిరాకరించడంతో గొడవ పడ్డాడు.
చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్‌ మిస్సింగ్‌.. అసలేం జరిగింది?

ఈ క్రమంలో చర్చిగాగిల్లాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతం నుండి వెళ్తున్న రమేష్‌పై దాడి చేసి ఛాతి, వీపు భాగాల్లో కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న దుండిగల్‌ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, కంచేరి మహేందర్‌లను సైతం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మూడు కత్తులు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement