
గాడ్జెట్లే ప్రధాన కారణం!
ఢిల్లీః పాఠశాల విద్యార్థుల్లో ఆధునిక జీవనశైలి దృష్టిలోపాలను తెచ్చిపెడుతోందని తాజా పరిశోధనలు నిర్థారించాయి. భారత దేశంలోని స్కూలుకెళ్ళే పిల్లల్లో 13శాతం మంది మయోపియాతో ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అత్యధికంగా వాడకం ముఖ్యంగా దృష్టి దోషాలకు కారణమౌతోందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధ్యయనాల్లో వెల్లడైంది.
పాఠశాల పిల్లల్లో దృష్టిలోపాలకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లే ప్రధాన కారణమౌతున్నాయని ఎయిమ్స్ అధ్యయనాలు వెల్లడించాయి. పదేళ్ళ క్రితం చైనా సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలతో పోలిస్తే.. భారత్ లో మయోపియాతో బాధపడే పిల్లలు కేవలం ఏడు శాతం మాత్రమే ఉండేవారని ఎయిమ్స్ ఆప్థాల్మిక్ సైన్సెస్ సెంటర్ కి చెందిన అధ్యయనకారుడు రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. మయోపియాతో బాధపడే వారికి దూరపు వస్తువులు సరిగా కనిపించవు. దీన్నే వాడుకలో షార్ట్ సైటెడ్ నెస్, నియర్ సైటెడ్ నెస్ గా పిలుస్తారని, దూరంగా ఉన్న వస్తువులను చూసేప్పుడు వాటినుంచి వచ్చే కాంతి రెటీనా మీద పడటకపోవడంతోనే ఆయా వస్తువులు కనిపించవని, అదే దగ్గరగా ఉన్న వస్తువులు చూసేప్పుడు ఆ ప్రభావం ఉండదని చెప్తున్నారు.
''కంటికి సంబంధించిన సమస్యలపై ఇండియాలో అతి తక్కువ అధ్యయనాలు జరుగుతున్నాయి, వాటిలో మయోపియా ఒకటి. అయితే పిల్లల్లో ఉండే ఇతర కంటి సమస్యలపై కూడ తాము జాతీయ సర్వే నిర్వహిస్తున్నామని, మరిన్ని అధ్యయనాలు చేస్తున్నామని ఎపెక్స్ ఐ సెంటర్ ఆఫ్ ఇండియా.. ఆర్పీ సెంటర్ హెడ్ అతుల్ కుమార్ చెప్తున్నారు. 'ఆర్పీ సెంటర్ ఫర్ ఆఫ్తమాలజిక్ సైన్సెస్' 49వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అతుల్ తమ అధ్యయనాల వివరాలను ప్రకటించారు. తాజా అధ్యయనాలు.. దేశంలోని ఎన్నో కంటికి సంబంధించిన సమస్యలను వెలుగులోకి తెస్తాయన్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్తమాలజీకి చెందిన ఆర్పీ సెంటర్ ను 1967 లో స్థాపించారు. ప్రస్తుతం 14 క్లినికల్, పారా క్లినికల్ విభాగాల్లో 41 మంది సభ్యులతో ఈ సెంటర్ పనిచేస్తోంది. ఆర్పీ సెంటర్ స్థాపించినప్పటినుంచీ ఆస్పత్రి కార్నియా రీట్రైవల్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద విరాళాలతో ఇప్పటిదాకా సేకరించిన 1,400 కార్నియాలనుంచి సుమారు 950 కంటి శుక్లాల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించామని ఎయిమ్స్ ఆప్థమాలజీ ప్రొఫెసర్ జీవన్ సింగ్ తాత్యాల్ తెలిపారు.