'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం! | 13-year-old victim was trained in martial arts, fought with accused for 30 minutes | Sakshi
Sakshi News home page

'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం!

Published Mon, Aug 1 2016 6:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం!

'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం!

నోయిడాః మానవత్వం లేని మృగాళ్ళ ముందు మార్షల్ ఆర్ట్స్ కూడా పనికి రావడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా... మహిళల్లో అవగాహన పెరిగినా రాక్షసత్వానికి బలవంతులూ బలైపోతున్నారు. రాజధాని నగరంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన అనంతరం.. అటువంటి ఘటనలే పునరావృతం అవుతున్నా కఠిన చట్టాలు మాత్రం అమల్లోకి రావడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్  బులంద్ షహర్ లో జరిగిన గ్యాంగ్ రేప్ లో బాధితురాలు 13 ఏళ్ళ  మైనర్ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో  శిక్షణ పొంది ఉండటంతో 30 నిమిషాలపాటు దుండగులతో పోరాడి చివరికి దారుణానికి బలైన ఘటన.. అందర్నీ ఆలోచింపజేస్తోంది.

దేశంలో గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ కాన్పూర్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా.. అటుగా ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడిచేసి, ఓ మహిళ సహా ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలసిందే. అయితే బాధిత 13 ఏళ్ళ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో సుమారు అరగంట పాటు దుండగులతో పోరాడినట్లు తెలుస్తోంది. అయితేనేం చివరికి సామూహిక దాడిని ఎదుర్కోలేక, మానవ మృగాల పైశాచికత్వానికి బలవ్వాల్సిన దుస్థితి ఎదురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నోయిడానుంచీ షాజహాన్పూర్ కు కారులో వెడుతున్న కుటుంబాన్ని అడ్డగించిన ఆరుగురు సభ్యుల దోపిడీ దొంగల ముఠా... కారులోని ఇతర కుటుంబ సభ్యులను తాళ్ళతో కట్టి, వాహనంలోని మహిళను, 13 ఏళ్ళ కుమార్తెను బయటకు లాగి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతేకాదు వారివద్ద ఉన్న నగలు, నగదు, సెల్ ఫోన్లు సైతం దోచుకెళ్ళారు. అయితే తమ కుమార్తె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిందని, దుండగులను ఎదుర్కొనేందుకు సుమారు అరగంటపాటు తీవ్రమైన పోరాటం జరిపిందని బాధితురాలి తండ్రి తెలిపారు. చివరికి ఆమెను ఎదుర్కోలేని దుండగులు.. తనపైనా, అన్నగారిపైనా కాల్పులకు పాల్పడ్డంతో వారి క్షేమాన్ని కోరి... తమ బిడ్డ దుండగులకు లొంగిపోయినట్లు ఆయన వివరించారు. ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా వారిని బాధితులు గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు ఉత్తరప్రదేశ్ లోని శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కుటుంబ సభ్యులతో వెడుతున్న మహిళలకే భద్రత లేకపోతే ఇంకెవరికుంటాయంటూ ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement