వాషింగ్ మెషిన్లో 2 కిలోల బంగారం...
ముంబై: రెండు కిలోల బంగారం బిస్కట్ల స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. బంగారు బిస్కట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ముంబై ఎయిర్ పోర్టు నిఘా విభాగం(ఏఐయూ) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 19 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ అస్లాం షేక్ అనే వ్యక్తి రియాద్ నుంచి భారత్ కు వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో అధికారులు రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న వాషింగ్ మెషిన్ లో ఏదో అనుమానిత వస్తువులు ఉన్నట్లు గమనించారు.
వాషింగ్ మేషిన్ ను పరిశీలించి చూడగా ఒక్కొక్కటిగా 19 గోల్డ్ బిస్కట్లు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు రెండు కిలోలకు పైగా ఉందని, విలువ దాదాపు అరవై లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారు బిస్కట్లను మరో వ్యక్తిని తాను అప్పగించాల్సి ఉందని, అతని పేరు సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అస్లాం షేక్ కోసం ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న సల్మాన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది అన్న కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టమామని ఎయిర్ పోర్టు నిఘా విభాగం అధికారులు వివరించారు.