వర్షం కోసం ఇద్దరు బాలికలకు వివాహం
తుమకూరు: వరుణుడి కరుణ కోసం కప్పలకు, కుక్కలకు, గాడిదలకు పెళ్లిళ్లు చేయడం సాధారణమే. అయితే, కర్ణాటకలోని తుమకూరు జిల్లా హులియూరు తాలూకా సొమజ్జనపాళ్య గ్రామంలో ఇద్దరు బాలికలకు (వీరిలో ఒకరికి వరుడి వేషధారణ చేశారు) వివాహం చేశారు. వివరాలిలా ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఈ వివాహ వేడుకలు గత నెల 27న ప్రారంభమై శనివారం రాత్రి ముగిశాయి. సూర్య దేవుడు, భూమాతకు వివాహంగా భావించిన స్థానికులు ఈ క్రతువుకు తింగళమామ (నెల మామ) అనే పేరు పెట్టారు. వేడుకలు మొదలైన తొలి రోజు నుంచి గ్రామంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేసి అలంకరణ చేశారు. చివరి రోజున గ్రామంలోని బావి నుంచి నీటిని తెచ్చి మట్టితో గంగమ్మను రూపొందించి పూజ చేశారు.
గ్రామం నడిబొడ్డున మండపం ఏర్పాటు చేసి.. దీపాలు వెలిగించారు. అనంతరం గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని వరుడిగా సింగారించి శోభరాజ్‌గా నామకరణం చేశారు. మరో అమ్మాయిని వధువుగా అలంకరించి వర్షిణిగా నామకరణం చేశారు. ఇద్దరినీ కోలాటం, డోలు, డప్పు తదితర వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు. గ్రామ పెద్దలు పురోహితులుగా మారి మాంగళ్యధారణ మినహా ఇతర కార్యక్రమాలతో వివాహ తంతు ముగించారు. ఈ సందర్భంగా హాజరైన వారికి అన్నదానం కూడా చేశారు. ఇలా చేయడం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ఇది తమకు సంప్రదాయంగా వస్తోందని గ్రామపెద్దలు తెలిపారు.