టీనా - ఆమీర్‌ల జోడి
న్యూఢిల్లీ : నంబర్ వన్ ఎప్పుడూ నం.1నే కోరుకుంటుంది. మరి ప్రేమ విషయంలో...ఈ పట్టింపులు ఉండవు. ప్రేమకు నం1, నం.2, కులం, జాతి, మతాలతో పనిలేదు. దానికి తెలిసిందల్లా ప్రేమను పంచడం. ప్రతి ప్రేమికులు తామే ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ జోడి అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రేమ కబుర్లు ఎందుకంటే టీనా దబి, అథర్ ఆమీర్ ఉల్ షఫీ ఖాన్ జోడి గుర్తుందా? మూడేళ్ల క్రితం సివిల్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన భోపాల్‌కు చెందిన టీనా దబి, అదే పరీక్షలో రెండో ర్యాంకు సాధించిన కాశ్మీర్‌కు చెందిన అథల్ ఆమీర్ ఖాన్‌లు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ శనివారం దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
రాజస్థాన్ కాడర్‌కు చెందిన టీనా దబి ప్రస్తుతం అజ్మీర్‌లో సేవలు అందిస్తున్నారు. శిక్షణలో ఉండగా వీరుద్దరు ప్రేమించుకున్నారు. శిక్షణ అయిపోయిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్న వీరు మూడు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని ముందే అనుకున్నారు. కానీ వీరు తమ ప్రేమను గోప్యంగా ఉంచాలనుకోలేదు. వీరివురు కలిసి ఉన్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేవారు. చాలా మంది వీరి ప్రేమను మెచ్చుకోగా, కొందరు మాత్రం విమర్శించారు. కొందరు టీనాను ఉద్ధేశించి నువు హిందువు అయి ఉండి ఒక ముస్లింను ఎలా పెళ్లి చేసుకుంటావు అని విమర్శించారు.
అందుకు టీనా గట్టిగానే సమాధానం చెప్పింది. ‘స్వతంత్ర భావాలు గల స్త్రీగా నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు ఉంది. నా నిర్ణయం పట్ల నా కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా సంతోషంగా ఉన్నారు’ అని బదులిచ్చింది. వీరి ప్రేమ గురించి టీనాను అడగ్గా ఖాన్‌ను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను అన్నారు. దళితుల్లో తొలిసారి మొదటి ర్యాంకు సాధించిన మీరు ఇకమీదట దళితులకు స్ఫూర్తిగా ఉండనున్నారా అని అడగ్గా అలాంటిదేమిలేదని, తాను సాధించాల్సింది ఎంతో ఉందని తెలిపింది. శ్రమ, దేవుడి అనుగ్రహం వల్ల తాను మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పింది. టీనా తల్లి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాగా ఆమె తండ్రి ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment