పట్టాలు తప్పిన ఉత్కళ్‌ | 23 people Killed, 72 Injured as Utkal express derails In UP's Muzaffarnagar | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Published Sun, Aug 20 2017 2:54 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

23 people Killed, 72 Injured as Utkal express derails In UP's Muzaffarnagar

- యూపీలో ఘోర రైలు ప్రమాదం 
23 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు

 
ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్‌ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. రైల్లోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్,  ఏటీఎస్‌ బలగాలు, వైద్య బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాదతీవ్రతతో ఒక బోగీ ట్రాక్‌ పక్కనున్న ఇంట్లోకి దూసుకుపోగా.. రెండు బోగీలు ఒకదానిపైకి మరకొటి ఎక్కాయి.

సహాయక చర్యల్లో స్థానికులు కూడా బలగాలకు సాయం చేస్తున్నారు. ఘటనాస్థలంలో పరిస్థితి భీతావహంగా మారింది. అంబులెన్సుల ద్వారా బాధితులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. శనివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మీరట్‌ జోన్‌ రైల్వే మెడికల్‌ అధికారి పీఎస్‌ మిశ్రా స్పష్టం చేశారు. ఎస్‌1 నుంచి ఎస్‌ 10 వరకు స్లీపర్‌ కోచ్‌లు, థర్ట్‌ ఏసీ బీ1, సెకండ్‌ ఏసీ ఏ1, ప్యాంట్రీ బోగీలు పట్టాలు తప్పాయన్నారు. 
 
ప్రమాదానికి కారణమేంటి? 
దుర్ఘటన విషయం తెలియగానే మొదట దీన్ని ఉగ్రవాద ఘటనగానే రైల్వే శాఖ, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం భావించాయి. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, వైద్య బృందాలతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌)ను కూడా యూపీ సర్కారు రంగంలోకి దించింది. అయితే.. దుర్ఘటన జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన ఆధారాలతో.. మానవ తప్పిదమే ఈ ఘటనకు కారణమని యూపీ సర్కారు స్పష్టం చేసింది. ఏటీఎస్‌ కూడా దీన్ని ధ్రువీకరించింది. మీరట్‌–సహరాన్‌పూర్‌ డివిజన్‌లో పలుచోట్ల రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు చేపడుతున్నారు.

ఈ విషయంపై ఆ మార్గంలో ప్రయాణించే రైలు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా రైలు వేగాన్ని డ్రైవర్‌ నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే రిపేర్లు జరుగుతున్న విషయాన్ని డ్రైవర్‌కు సూచించకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నార్తర్న్‌ రైల్వేలో చాలా రద్దీగా ఉండే ఈ లైన్‌ ద్వారా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ముజఫర్‌నగర్‌ అధికారులు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. 0131–2436918, 0131–2436103, 0131–2436564 నంబర్ల ద్వారా వివరాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
 
ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి 
ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన బాధాకరమన్న మోదీ.. బాధితులను ఆదుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ‘ముజఫర్‌నగర్‌ వద్ద రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన బాధాకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీటర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన తమను కలచివేసిందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. తనే స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దుర్ఘటన కారకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయకచర్యలను వేగవంతం చేసేందుకు యూపీ సర్కారుతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25వేల పరిహారం ఇవ్వనున్నట్లు సురేశ్‌ ప్రభు వెల్లడించారు. యూపీ సీఎం యోగి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా, ఇద్దరు యూపీ మంత్రులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్, ట్రాఫిక్‌ బోర్డు సభ్యులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చీకటి కారణంగా సహాయకచర్యలకు ఆటంకం కలగకుండా.. విద్యుత్‌ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 
 
ఒడిశా బాధితులకు రూ.5లక్షలు 
ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా ప్రయాణికుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పట్నాయక్‌ ఆదేశించారు. కాగా, ప్రమాదానికి గురైన 14 బోగీల్లో కలిపి 80 మంది స్లీపర్‌ క్లాసులో, ఆరుగురు ఏసీ కోచ్‌లో పూరీలో ఎక్కినట్లు అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే 1072 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది.
 
పట్టాలెక్కని కకోద్కర్‌ సిఫార్సులు 
ముజఫర్‌నగర్‌ దుర్ఘటన భారత రైల్వే భద్రతలోని డొల్లతనాన్ని మరోసారి స్పష్టం చేసింది. రైల్వే భద్రతా అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనిల్‌ కకోద్కర్‌ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఐదేళ్లు గడిచినా కమిటీ చేసిన సూచనల్లో చాలా మటుకు ఇంకా అమలుకు నోచుకోలేదు. అందులో... ఐదేళ్ల కాలానికి ప్రయాణికుల భద్రత కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో పాటు, రైల్వే భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటు లాంటివి ఉన్నాయి. రైల్వే బోర్డుపై పని ఒత్తిడి పెరిగినా, భద్రతా ప్రాధికార సంస్థపై ఎలాంటి పురోగతి జరగలేదు. 
 
కమిటీ చేసిన మరికొన్ని సిఫార్సులు
రైల్వే కార్యకలాపాల పర్యవేక్షణకు సంస్థ ఏర్పాటు 
ఐదేళ్లలో అన్ని లెవల్‌ క్రాసింగ్‌ల ఎత్తివేత 
లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించడానికి అయ్యే ఖర్చు రూ.50 వేల కోట్లు. నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని 8 ఏళ్లలో తిరిగి రాబట్టుకోవచ్చు. 
అన్ని బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలు, నీటి ప్రవాహ వేగాలను తరచూ పర్యవేక్షించాలి. 
రైలు లోకోపైలట్‌కు సూచించేలా ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలను కొలిచే పరికరాలు, టర్బైన్‌ ఫ్లో మీటర్లను బిగించాలి. 
రూ. 20 వేల కోట్ల వ్యయంతో యూరప్‌ దేశాల మాదిరిగా అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలి.
 
భారీ రైలు ప్రమాదాలు 
డిసెంబర్‌ 28, 2016: యూపీలోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లాలో షెల్దా–అజ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 62 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
నవంబర్‌ 20, 2016: యూపీలోని ఫతేపూర్‌ సమీపంలో కల్కా మెయిల్‌కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 70 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. 
మే 28, 2010: పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు పట్టాలు తొలగించడంతో జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 148 మంది మృతిచెందారు. 
సెప్టెంబర్‌ 9, 2002: హౌరా–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బిహార్‌ రాష్ట్రం ఔరంగాబాద్‌ జిల్లాలోని దవే నదిలో పడడంతో 100 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు.  
ఆగస్టు 2, 1999: 2,500 మందితో వెళ్తున్న రెండు రైళ్లు అస్సాంలోని గైసల్‌ సమీపంలో ఢీకొనడంతో 290 మంది మరణించారు. 
నవంబర్‌ 26, 1998: పంజాబ్‌లోని ఖాన్నా సమీపంలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్‌ మెయిల్‌ను జమ్ముతావి–షెల్దా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.  
సెప్టెంబర్‌ 14, 1997: అహ్మదాబాద్‌–హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 5 బోగీలు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లాలోని నదిలో పడడంతో 81 మంది దుర్మరణం చెందారు.  
ఆగస్టు 20, 1995: యూపీలోని ఫిరోజాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆగిఉన్న కలింది ఎక్స్‌ప్రెస్‌ను పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో 400 మంది మరణించారు. 
ఏప్రిల్‌ 18, 1988: యూపీలోని లలిత్‌పూర్‌ సమీపంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.  
జూలై 8, 1988: కేరళలోని అష్టముది సరస్సులో ఐలాండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పడడంతో 107 మంది మరణించారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement