భారీ ఎన్కౌంటర్: 24మంది మావోయిస్టుల మృతి
మల్కాన్గిరి: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఏవోబీలో మావోయిస్టుల కీలక సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారంతో మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు వద్ద ఆంధ్రా గ్రేహౌండ్స్-ఒడిశా ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 24మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో 11 మంది పురుషులు, 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు విశాఖ ఎస్పీ రాహుల్ శర్మ తెలిపారు. ఘటనా స్థలంలో భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బలిమెల రిజర్వాయర్లోని ఓవోబీ కటాఫ్ ఏరియాలో ఈ ఆపరేషన్ జరిగింది. ఎన్ కౌంటర్ లో కీలక నేత మల్లేశ్ చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే పరారైనట్లు సమాచారం. అలాగే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరైన అజీజ్ బాషా విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ డి.సతీష్‌ను విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు.
11 మంది మృతదేహాల గుర్తింపు
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులలో సోమవారం మధ్యాహ్నానికి 11 మంది మృతదేహాలను గుర్తించారు. వారి వివరాలు... ఐనపర్తి దాసు అలియాస్ మధు(పశ్చిమ గోదావరి), గామెల్లి కేశవరావు అలియాస్ బిర్సు (వైజాగ్), లత అలియాస్ పద్మ(మహేందర్ భార్య, హైదరాబాద్), రాజేష్, బొడ్డు కుద్నాలు అలియాస్ మమత(సురేష్ భార్య, శ్రీకాకుళం), సింహచలం అలియాస్ మురళి(విజయనగరం), స్వరూప అలియాస్ రికీ(తూర్పుగోదావరి), బరుకు వెంకట ప్రసాద్(వైజాగ్), చామెళ్ల కృష్ణ అలియాస్ దయా(శ్రీకాకుళం), శ్వేత, బుడ్రి గా తెలుస్తోంది. మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.