ప్రమాదస్థలం వద్ద గుమిగూడిన ప్రజలు
భావ్‌నగర్: పెళ్లి వేడుకలకు వెళ్తున్న ట్రక్కును మృత్యువు వెంటాడింది. అప్పటివరకు పెళ్లి కబుర్లతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. రక్తసిక్తమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బ్రిడ్జి నుంచి కిందికి పడిపోయింది.
దీంతో 30 మందికిపైగా చనిపోయారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. 26 మంది ఘటనా స్థలిలోనే చనిపోయారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు.
ఉదయం 7:30–7:45 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, జిల్లా అధికారులు, స్థానిక గ్రామాల ప్రజలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.‘బోతాడ్ జిల్లాలోని టోటమ్ గ్రామంలో పెళ్లికి హాజరయ్యేందుకు దాదాపు 60 మందితో అనిదా గ్రామం నుంచి ట్రక్కు బయలుదేరింది. భావ్‌నగర్–రాజ్‌కోట్ రహదారిపై రంగోలా వద్ద బ్రిడ్జిపై ముందు వెళ్తున్న వాహనాన్ని దాటబోయి.. అదుపుతప్పి కింద పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ఐఎం సయ్యద్ తెలిపారు. మరోవైపు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment