ప్రైవేట్ కంపెనీల్లోనూ 26 వారాల మెటర్నిటీ లీవ్
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు: దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలతో బాటు అన్ని సంస్థల్లోనూ 26 వారాల పాటు ప్రసూతి సెలవును తప్పనిసరి చేసే చట్టాన్ని కేంద్రం తీసుకొస్తోంది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో సంబంధిత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందనికార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికే 26 వారాలు లేదా ఆరు నెలల మెటర్నిటీ లీవ్ అమల్లో ఉంది. అయితే ప్రైవేట్ కంపెనీలు మాత్రం 12 వారాలు లేదా 3 నెలలే ఆ సెలవు మంజూరు చేస్తున్నాయి.
కొన్ని చిన్న సంస్థలు ఆ సదుపాయాన్నీ కల్పించడంలేదు. బిల్లు మహిళలు, పిల్లలకు మాత్రమే సంబంధించినదని, పెటర్నిటీ లీవ్‌కు సంబంధంలేదని దత్తాత్రేయ చెప్పారు. పనిచేసే తల్లులకు ఇంటినుంచే పని సౌకర్యాన్ని కల్పించడాన్ని తప్పనిసరి చేయాలన్న నిబంధనను ఆయన తోసిపుచ్చారు. 24 గంటలూ పనిచేసే హోటళ్లు, ఇతర సంస్థలు వస్తే మహిళలకూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.